అసెంబ్లీలో కేసీఆర్‌ అసత్య ప్రచారం

– టీడీపీ ప్రధానకార్యదర్శి ఐలయ్యయాదవ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణ పరిస్థితులు దిగజారి పోయాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ క్యాబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాము లేనని గుర్తు చేశారు. 2009 సంవత్సరంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని కేటీఆర్‌ ఎమ్మెల్యేగా, కేసీఆర్‌ ఎంపిగా గెలవలేదా? అప్పుడు గుర్తుకు రాలేదా విద్యుత్‌ సమస్యలు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసిన సంస్కరణలు, పరిపాలనా దక్షతతోనే రాష్ట్రంలో సంపద పెరిగిందన్నారు. గొర్రె తోక బెత్తడు అన్నట్టుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ రూ.50 వేల కోట్లకు పెంచిందన్నారు. సంపద ఎట్లా సష్టించాలో, రాష్ట్రాన్ని ఎలా అభివద్ధి చేయాలో చంద్రబాబు నాయుడుకే తెలుసంటూ కేసీఆర్‌ చెప్పింది వాస్తవం కాదా అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అనేక సాగు నీటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభించారని గుర్తు చేశారు. జూరాల, ఏఎంఆర్‌ ప్రాజెక్టు తో పాటు అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు దేవాదుల, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులు టీడీపీ హాయంలో నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు.
ఈ మేరకు ఒక మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.