కేసీఆర్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయి నాడు నవ్వినోళ్లే నేడు అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు మున్సిపల్‌ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని, తెలంగాణ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు జై తెలంగాణ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి వేషధారణతో పాటు తెలంగాణ సంస్కృతిని చాటేలా వేషధారణతో చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పల్లెలు పట్టణాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని గతంలో ఎన్నడు లేని విధంగా పల్లె పట్టణ అభివృద్ధి విశేషంగా సాగుతుందని అన్నారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ స్థాపన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ ఫలాలను రూపొందించి అమలు చేస్తున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణలో ముఖ్యంగా భూముల ధరలు పెరగడం, నిరంతర విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాల రూపకల్పన, రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, పింఛన్లు ఇలా ఇంకా ఎన్నో మహౌత్తర కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేసుకున్నారు. ప్రజల సహకారం, ఆశీర్వాదం ఉంటే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. శ్రీశైలం నుండి షాద్‌నగర్‌ వరకు మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లు తరలించి ఇంటింటికి నల్ల నీరు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్నిదని అన్నారు. ఇంటింటికి నల్లా ఇస్తామని చెబితే కొందరు నవ్వుకున్నారని ఇప్పుడు ఇంటింటికి నల్ల నీరు చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు షాద్‌నగర్‌ పట్టణంలో 2025 పింఛన్లు వచ్చేవని, దీనికి ప్రతినెల 5 లక్షల 56 వేల రూపాయలకు పైగా ఖర్చయ్యావని తెలంగాణ వచ్చాక 4175 పింఛన్లు ఇస్తున్నామని, వీటికి ప్రతినెల 87 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఆనాడు 65 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు 9 ఏళ్లలో ప్రగతిని సాధించామని ధీమా వ్యక్తం చేశారు. అభివద్ధిని చూసి గర్వపడుతున్నానని ఎమ్మెల్యే అన్నారు.
పాలన పరంగా షాద్‌నగర్‌ మెరుగ్గా ఉంది : అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్‌
పాలన పరంగా చూస్తే అన్ని నియోజకవర్గాల కంటే మెరుగ్గా ఉందని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. రోడ్లు హరితహారం ప్రభుత్వ భవనాలు చూస్తుంటే ఒక అధికారిగా ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అదే విధంగా పారిశుధ్య కార్మికులకు వేతనాల విషయంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మెరుగ్గా వేతనాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. పారిశుధ్య కార్మికులకు భీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార సొసైటీ చైర్మన్‌ రాజా వరప్రసాద్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ నటరాజన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న, నోడల్‌ ఆఫీసర్‌ భాస్కర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ విశ్వం, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంకాయల నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళ సంఘ సభ్యులు, ఏఎన్‌ఎమ్‌, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.