కేసీఆర్‌వి కపట నాటకాలు

– వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మెదక్‌ సభలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం దొంగే… దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నరేండ్లు గడీల్లో మొద్దునిద్ర పోయి, మద్యం మత్తులో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కినందుకు ఆయన్ని ఏమనాలని ప్రశ్నించారు. ఈ మేరకు గురవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, జనం నెత్తిన రూ.4 లక్షల కోట్ల రుణభారం మోపిన మిమ్మల్ని ఏమనాలి అని అడిగారు. సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల కమీషన్లు తిన్నారని ఆరోపించారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, ఉచిత ఎరువులు, సున్నా వడ్డీకే రుణాలు అంటూ ఇచ్చిన హామీల అమలు ఏమైందన్నారు.