కేరళ మరో పిటిషన్‌

Kerala is another petition– బిల్లుల పెండింగ్‌పై గవర్నర్‌ వైఖరికి నిరసన
న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఆమోదించిన ముఖ్యమైన బిల్లులను మంజూరు చేయకుండా నిలుపుదల చేసిన గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండో పిటిషన్‌ దాఖలు చేసింది. బిల్లులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ఆదేశించలేమన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ముఖ్యమైన బిల్లులను పెండింగ్‌లో ఉంచటంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుండగా, గవర్నర్‌పై చీఫ్‌ సెక్రటరీ, లా సెక్రటరీ మరో పిటిషన్‌ వేశారు. గవర్నర్‌ తీరుపై న్యాయవాది పీవీ జీవేష్‌ గతంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌కు కోర్టు కాలపరిమితిని నిర్ణయించదని పేర్కొంటూ.. జీవేష్‌ పిటిషన్‌ను హైకోర్టు 2022 నవంబర్‌లో కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్లు వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలంటూ ప్రత్యేక అనుమతి పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అసెంబ్లీ ఆమోదించిన ఎనిమిది ముఖ్యమైన బిల్లులను గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచారు. గవర్నర్‌ పరిశీలనకు పంపిన వాటిలో మూడు బిల్లులు ఇప్పటికే రెండేండ్లు పూర్తయ్యాయి. మరో మూడు బిల్లులపై ఏడాదికి పైగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణ గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 200లోని ప్రస్తావించింది. ‘సాధ్యమైనంత త్వరగా’ అనేది రాజ్యాంగపరంగా చాలా ముఖ్యమైనదనీ, రాజ్యాంగబద్ధంగా ఉన్నవారు ఆ విషయాన్ని మరచిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్‌ ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేయడం వల్ల శాసనసభకు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరించే గవర్నర్లకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 రక్షణకు అర్హత లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా, కేరళ తరపున మాజీ అటార్నీ జనరల్‌, రాజ్యాంగ నిపుణుడు కేకే వేణుగోపాల్‌ సహా సీనియర్‌ న్యాయవాదులు హాజరుకానున్నారు.