ఆహార భద్రత సూచీలో కేరళ టాప్‌

– రెండో స్థానంలో పంజాబ్‌
– పడిపోయిన గుజరాత్‌
న్యూఢిల్లీ : ఆహార భద్రత సూచీ 2022-23లో కేరళ చక్కని ప్రదర్శనను కనబర్చింది. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్‌ రెండో స్థానంలో ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా బుధవారం విడుదల చేసిన ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఐదో ఆహార భద్రత సూచిక (ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ)లో ఆయా రాష్ట్రాల ర్యాంకులు వెలువడ్డాయి. ఆహార భద్రత సూచిక సమాచారం ప్రకారం.. దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉన్నది. గుజరాత్‌, మహారాష్ట్రలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ విషయంలో 2020-21లో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉండగా ఈ సారి దాని ర్యాంకు పడిపోవటం గమనార్హం. ఇక చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే గోవా వరుసగా నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి. గతేడాది కూడా ఈ మూడు రాష్ట్రాలు అవే స్థానాల్లో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూకాశ్మీర్‌, ఢిల్లీ, చండీగఢ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది కూడా ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే స్థానాలలో ఉండటం గమనార్హం. జిల్లాల కోసం ఉద్దేశించిన ఈట్‌ రైట్‌ ఛాలెంజ్‌-ఫేజ్‌ 2 విజేతలను కూడా కేంద్ర మంత్రి సత్కరించారు. ఇందులో అనేక జిల్లాలు తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, యూపీ, మహారాష్ట్రల నుంచి ఉన్నాయి. ఇవి అసాధారణ ఫలితాలను సాధించాయి. పాల్గొన్న 260 జిల్లాలలో 31 విజయవంతంగా 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను సాధించాయి. ఆహార భద్రత సూచిక ఆహార భద్రతకు సంబంధించిన వివిధ అంశాలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేస్తుంది. ఇందులో మానవ వనరులు, సంస్థాగత సమాచారం, సమ్మతి, ఆహార పరీక్ష సౌకర్యం, శిక్షణ, సామర్థ్యం పెంపుదల, వినియోగదారుల సాధికారత వంటివి ఉన్నాయి.