పాలమూర్‌ అంటే మైగ్రేషన్‌..ఇప్పుడు ఇరిగేషన్‌

– తెలంగాణలో సమీకృత అభివృద్ధి
– మంచి పనులే మానవత్వాన్ని చాటుతాయి
– మేధస్సును ఎప్పటికప్పుడూ అభివృద్ధి చేసుకోవాలి : మంత్రి కేటీఆర్‌
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌
”రాష్ట్రంలో సమీకృత అభివృద్ధి జరుగుతోంది.. మంచి పనులే మానవత్వం.. చేసిన పనులే మనిషిని చరిత్రలో నిలబెడతాయి.. మనిషి ఎప్పటికప్పుడూ తన మేధస్సును అభివృద్ధి చేసుకోవాలి.. లేదంటే వెనుకబడి పోతామమని” ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అంటే మైగ్రేషన్‌ అని.. ఇప్పుడు ఇరిగేషన్‌గా మారిందని చెప్పారు. మెట్టుగడ్డలోని బాలికల ఐటీఐ కళాశాలలో సెయింట్‌ ఫౌండేషన్న, శాంతా నారాయణగౌడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే, వేములలో ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్చర్లలో డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..డబ్బులు చాలా మందికి ఉండొచ్చు కానీ.. మంచి చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమన్నారు. మోహన్‌రెడ్డి ఇక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. పుట్టిన ఊరు రుణం తీర్చు తీర్చుకోవాలని, నేటి యువతకు టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. నేడు టెక్నాలజీ ఉన్న వాళ్లే ధనవంతులుగా ఎదుగుతున్నారని, అందరూ ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలన్నారు. 120 మందికి ఉద్యోగాలు ఇస్తున్న సెయింట్‌ డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్య మనిషిని ఒక స్థాయికి తీసుకుపోతుందన్నారు. మాట్లాడే నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎదగొచ్చన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రపంచంతో పోటీ పడే విధంగా గురుకుల విద్యార్థులను తయారు చేస్తున్నామని చెప్పారు. రూ.9500 కోట్ల పెట్టుబడితో అమర్‌ రాజా కంపెనీ రాబోతుందని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పింఛన్‌, 3 గంటల కరెంటు వస్తుందన్నారు. ‘ఏ రంగంలో చర్చకు వస్తరో రండి.. మీరు చేసిన ఉద్దారకమేంది.. మేం చెడగొట్టిందేది.. మేము అన్నీ బాగుచేశాం. కానీ నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. జడ్చర్లలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి కనిపిస్తలేదు..” అని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న 50 ఏండ్లలో రాష్ట్రంలో సక్రమంగా పనిచేస్తే ఈ సమస్యలెందుకుంటాయి.. ఈ యాత్రలెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు మిషన్‌ కాకతీయలో బాగు చేసుకున్న చెరువుల కాడ నిండిన నీళ్లను చూస్తూ పండుగ చేసుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌కు హెలికాప్టర్‌లో వస్తూ పైనుంచి చూస్తుంటే ఎర్రటి ఎండాకాలంలో నిండుకుండల్లా మారి.. మత్తళ్లు దుంకుతున్నరు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉద్దండాపూర్‌, కరివెన ప్రాజెక్టును చూపించారు.. ఈ ప్రాజెక్టులు నిండితే 1.44 లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి.. ఒకసారి కృష్ణా నీరు జడ్చర్లకు వస్తే దశాబ్దాల పాలమూరు గోస పీడపోతుందని చెప్పారు. బీజేపీ వాళ్లు కృష్ణా జలాలు పంచకపోయినా వాయువేగంతో పూర్తి చేసుకుంటూ ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి కరివెన, ఆ తర్వాత ఉద్దండాపూర్‌ నిండి జడ్చర్ల నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ దేశంలో అభివృద్ధి సూచికలో ముందు వరుసలో ఉందన్నారు. ప్రతిపక్షాల రాజకీయ నాయకుల విమర్శలను పట్టించుకోబోమని.. భాజాప్త దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Spread the love