– కేవీఐసీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మనోజ్‌లాంక్
– ఎఫ్‌టీసీసీఐలో హ్యాండ్లూమ్ ఎక్స్‌పో
– అన్ని బస్టాండ్‌లలో చేనేత స్టాల్స్ : చేనేత,జౌళి శాఖ డిప్యూటీ డైరెక్టర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖాదీ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమని(ది ఖాదీ మరియు విలేజ్ ఇండిస్టీస్ కమిషన్(కేవీఐసీ) రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మనోజ్‌లాంక్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐలో శుక్రవారం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్, ఎన్‌లైటెన్‌మెంట్ సెషన్‌ను నిర్వహించారు. ఎగ్జిబిషన్‌లో 20 మంది నేత కార్మికులు తమ మాస్టర్ క్రాఫ్ట్‌లను ప్రదర్శించారు. పరిశ్రమ, అకాడెమియా, వీవర్స్ ద్వారా నాలెడ్జి సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనోజ్‌లాంక్ మాట్లాడుతూ కేవీఐసీ పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ అని అన్నారు. భారతదేశంలో ఖాదీ పరిశ్రమ అభివద్ధి చెందుతున్నదని అన్నారు.ఖాదీ, విలేజ్ ఇండిస్టీస్ కమిషన్ ఉత్పత్తుల టర్నోవర్ రూ.1.34 లక్షల కోట్లను దాటిందని తెలిపారు. తొమ్మిదేండ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చేతివత్తుల వారు తయారు చేసిన దేశీయ ఖాదీ ఉత్పత్తుల విక్రయంలో అపూర్వమైన 332శాతం వృద్ధి నమోదైందన్నారు. చేతివత్తుల వారు అందజేస్తున్న యంత్రాలు, టూల్‌కిట్‌లను సద్వినియోగం చేసుకుని వీలైనంత ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించి స్వావలంబనకు సహకరించాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం. వెంకటేష్ మాట్లాడుతూ టెక్స్‌టైల్స్, చేనేత ఉత్పత్తులకు తెలంగాణ గొప్ప హబ్‌గా మారిందన్నారు. తెలంగాణ టెక్స్‌టైల్స్, అపెరల్ పాలసీ గొప్ప పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. భారతదేశంలోని ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీల్లో ఒకటైన వెల్‌స్పన్ రాష్ట్రంలో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.