– వేలంలో ఎకరం ధర రూ.100 కోట్లు
– 45.33 ఎకరాలు వేలంలో ప్లాట్లు దక్కించుకున్న 11 సంస్థలు
– ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 3319 కోట్లు
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కోకాపేట నియో పోలీస్ ఫేజ్-2 వేలంలో భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. 10వ నెంబర్ ప్లాట్‌లో ఎకరం ధర రూ. 100 కోట్ల మార్క్ దాటింది. గురువారం కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 45.33 ఎకరాల్లోని 7 ప్లాట్లను వేలం వేశారు. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఈ వేలంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఎకరానికి హెచ్‌ఎండీఏ ధర రూ.35 కోట్లుగా నిర్ణయించింది. కానీ ఆ భూములు రెట్టింపు ధర పలికాయి. అత్యధికంగా 10వ ప్లాట్ ధర రూ.100 కోట్లు పలకగా, అత్యల్పంగా 11వ ప్లాట్ ధర రూ.67.25 కోట్లు పలికింది. ఈ వేలం ద్వారా హెచ్‌ఎండీఏ అధికారుల అంచనాలకు మించి ప్రభుత్వానికి రూ.3319.60 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, వేలంలో 11 సంస్థలు పాల్గొని ప్రభుత్వ అంచనాలకు మించి పోటాపోటీగా వేలం వేయడం విశేషం.