నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మైనర్ బాలికపై దొంగతనం నెపం మోపి చిత్ర హింసలకు గురి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) డిమాండ్ చేసింది. బుధవారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి. స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం, చెన్నూరు గ్రామానికి చెందిన 12 ఏండ్ల పద్మశాలి బాలిక తమ ఇంట్లో దొంగతనం చేసిందనే నెపంతో పెత్తందార్లు బాలిక కంట్లో కారం కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన అగ్రకుల పెత్తందార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇరవై రోజుల క్రితం జరిగినప్పటికీ బాధితులు భయం గుప్పిట్లో విషయాన్ని బయటకు చెప్పలేక పోయారని తెలిపారు. అర్ధరాత్రి అరెస్టు చేయకూడదనే కనీస అవగాహన లేకుండా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. ఈ విషయంలో సీఐ, ఎస్సైలు పెత్తందార్ల కొమ్ముకాస్తున్నారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. దోషులకు శిక్షపడేలా మంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. .