4న కెవీపీఎస్‌ మండల సదస్సు

నవతెలంగాణ- నేలకొండపల్లి
గ్రామీణ ప్రాంతాలలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 4న కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండలంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సదస్సును జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు పాపెట్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మండల కేంద్రంలో సంఘం కార్యాలయంలో కెవిపిఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దళితుల సమస్యలను పరిష్కరించడంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దళిత బంధు పేరుతో రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు దళితులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. గ్రామాలలో అరకొరగా దళిత బంధు యూనిట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుందన్నారు. దీనివల్ల దళితుల జీవితాల్లో ఇటువంటి మార్పు రాలేదన్నారు. అనేకమంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దళితులకు 100 యూనిట్ల ఉచిత కరెంటు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని అర్హులైన దళితులందరికీ దళితబంధు యూనిట్లు మంజూరు చేయాలని, 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరి చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల రానున్న కాలంలో దళితుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసాలను విస్తతంగా ప్రచారం చేసి ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కెవిపిఎస్‌ జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు, బొడ్డు మధు, బొడ్డు వీరయ్య, మహేష్‌, కూరపాటి ప్రసాద్‌, సత్యనారాయణ, పెదపాక భాస్కరరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.