విలాపగీతం

కులం, మతం
రెండు అవిభాజ్య శక్తులై
భారతావని స్తనాలపై
రెండు జెండలుగా విర్రవీగుతూన్నాయి
పైశాచికత్వం పెచ్చుమీరి
వీర మాతను వివస్త్రను
చేసి ఊరేగిస్తూ
ఎండిపోతున్న గుండె నుండి
ఎర్రటి నెత్తుటిపాలని పీల్చి పీల్చి పిప్పిచేసి
మానవ మగం మానభంగం చేస్తుంటే
అవనితల్లి అచేతనవస్థలో
ఎన్ని సార్లు బుక్కబట్టి ఏడ్చి చచ్చిందో
ఏ నరమేధ నాజిలకు తెలుస్తుంది…

అలనాటి భారతంలో
కంటికి కనిపించని ద్రౌపది ఒక్కరే
కానీ…నేటి నా భారతావనిపై
పాచికలాటలో ప్రతి ఒక్క ఆడది
ఒక్కొ పాంచలిగా ఊరేగింపబడుతుంది
ఆరేళ్ల చిన్నారి నుండి
ఆరు పదుల అమ్మమ్మ వరకు.. ఆడదైతే చాలు
క్షణం క్షణం.. అనుక్షణం
రాకాసి మూకల ఆనవాళ్లు
ఆమె అణువణువునా
చెరపలేని గుర్తులుగా చెక్కబడుతున్నాయి
అసలే కంప్యూటర్‌ కాలం కదా
కనులతో కాన్పులు చేస్తు
కసాయి నాయకులు తిరుగుతున్న దేశం నాది..
అందుకే నన్ను క్షమించు తల్లీ
ఈ వైరాగ్యాన్ని వేయి కనులతో చూస్తున్నందుకు..!!

ఆమె నెలసరి నెత్తుటి గుడ్డల వాసనతో
మత్తులో మునుగుతున్న మురు?ల్లారా
ఒక్కసారి మీ మనోనేత్రాన్ని తెరచి చూడండి
ఈ సారి బ్రతకడానికి కాదు
చావడానికి బ్రతకాలి
మరొక్కసారి మిమల్ని రక్షించడానికి
ఏ అమ్మవారి గర్భం అండగా లేదు
ఎందుకంటే
ఆవిర్భావం..అంతం..
రెండు ఆమె చేతిలోనే ఇమిడి ఉన్నాయి కనుక..
– జి. గోపి, 90528 71896