భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

– అధికారుల నిర్లక్ష్యంతోనే భూ సమస్యలు
– సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కన్వీనర్‌ పగడాల యాదయ్య
– ఆర్డీవో వెంకటచారికి వినతిపత్రం
నవతెలంగాణ-మంచాల
సీలింగ్‌, అసైన్డ్‌, ఫారెస్ట్‌ భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కన్వీనర్‌ పగడాల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీవో వెంకటచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో సీలింగ్‌, అసైన్డ్‌ భూముల సమస్యలు, రంగాపూర్‌ , చీదేడ్‌ గ్రామాల్లో ఫారెస్ట్‌ భూముల సమస్యలు పరిష్కారం కాక పోవడంతో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆరుట్ల గ్రామంలో 684 సర్వే నెంబర్‌ లో 32 మంది రైతులు,1466 సర్వే నెంబర్‌లో 36 మంది రైతులు, 1363లో 12, మంది రైతులు,1671 సర్వే నెంబర్‌లో తొమ్మిది మంది రైతులు భూ సమస్యల పరిష్కారం ధర కాస్తూ చేసుకోవడం జరిగిందన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతోనే భూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.ఈ భూముల్లో రైతులు 50 ఏండ్లుగా వ్యవ సాయం చేస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. వారికి గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా సర్టి ఫికెట్లు, పాస్‌ బుక్కులు కూడా ఉన్నాయని చెప్పారు. కానీ ధరణి పోర్టల్‌ వచ్చిన తరువాత వీరికి కొత్త పాస్‌ పుస్తకాలు రాలేదన్నారు. కొత్తపాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందనీ, కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసినా ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్లు మాత్రం కదలడం లేదన్నారు. అంతేకాకుండా రంగాపూర్‌, చీదెడ్‌ గ్రామాల్లో ఫారెస్ట్‌ భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫారెస్ట్‌ భూముల సమస్యలు పరిష్కారం చేస్తామని చెబుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో, కొన్ని మండలాల్లో ఫారెస్ట్‌ భూముల్లో సాగు చేస్తున్న రైతుల పేర్లను నమోదు చేశారనీ, కానీ రంగాపూర్‌, చీదేడ్‌ ఫారెస్ట్‌ భూముల్లో రైతుల పేర్లు నమోదు కాలేదన్నారు. ఇలాంటి భూ సమస్యల వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.లేనియేడల సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగీళ్ళ శ్యాంసుందర్‌, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌ రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మార బుగ్గ రాములు, డీవైఎఫ్‌ఐ మండలాధ్యక్షులు డి.రామకృష్ణ, నాయకులు నోముల జంగయ్య ,సింగారం రమేష్‌ ,శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.