మహబూబాబాద్‌లో పేదలపై లాఠీచార్జి దారుణం

– ఈ ఘటనను ప్రతిఒక్కరూ ఖండించండి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహబూబాబాద్‌ పట్టణంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పేదలపైనా, మహిళలపైనా పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమనీ, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. గుడిసెలను కూల్చటం, తాగునీటి బావులను పూడ్చేయటం, అడ్డువచ్చిన వారిని కొట్టడం అన్యాయమని పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతో కుమ్మక్కయిన స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రిపైనా చర్యలు తీసుకోవాలనీ, ఘటనకు కారణమైన పోలీసులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి డబుల్‌ బెడ్‌ రూములైనా నిర్మించి ఇవ్వాలనీ, కుదరకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో 15 లక్షలు ఇవ్వాలని కోరారు.