పిల్లల పెంపకమంటే అంత సులభమైన విషయం కాదు. అలా అని మరీ కష్టం కూడా కాదు. పిల్లల భవిష్యత్తు చాలా వరకు తల్లిదండ్రుల ఆలోచనలు, ఆచరణ, పెంపకంపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరైన దారిలో నడిపించడంతో పాటు.. వారిని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలి. కానీ ఈ ఆధునిక యుగంలో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని మంచిగా పెంచడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండరు. వాళ్లమీద యజమాయిషీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వాళ్ల సమస్య గురించి చెప్పినా కసురుకుంటూ ఉంటారు. దీంతో చిన్నారులు వారి మనసులోని భావాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య ఉండటం అంత మంచిది కాదు. అందుకే ఇంట్లో ఎప్పుడూ స్నేహపూర్వకమైన, సరదాలతో కూడిన వాతావరణం ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. అలాగని పూర్తిగా వారికి స్వేచ్ఛనివ్వమని కాదు. వారికి స్నేహహస్తాన్ని అందిస్తూనే.. తప్పు చేస్తున్నప్పుడల్లా హెచ్చరిస్తుండాలి.
కోపం వద్దు
పిల్లలకు కొన్నిసార్లు ఏవో చిన్న చిన్న పనులు చేయమని చెప్తుంటాం. వారు ఆ పనులు సరిగా చేయకపోతే తిట్టడం, కొట్టడం, అరవడం చేస్తుంటారు తల్లిదండ్రులు. ఇలా చేస్తే పిల్లలు ఇంకా మొండిగా తయారవుతారు. అలా కాకుండా ఆప్యాయంగా దగ్గరకి పిలుచుకుని చెప్తే పిల్లలు మాట వింటారు.
వేరేవాళ్లతో పోల్చవద్దు
చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను వేరే పిల్లలతో పోలుస్తారు. ఇలా చేస్తే.. పిల్లలు కచ్చితంగా నెగటివ్‌గా ఎఫెక్ట్ అవుతుంటారు. మీ పిల్లల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలను తెలుసుకోండి. వాటిని మెరుగుపరచడానికి కావలసిన తోడ్పాటు అందించండి. ఇతరులతో పోల్చకండి. మీ పిల్లలు అందరికంటే ప్రత్యేకమైన వారని ముందు మీరు గుర్తించండి.
ఇవి కూడా నేర్పించండి
ఇతరులతో ఎలా మాట్లాడాలో పిల్లలకు నేర్పించడం తల్లిదండ్రులకు మొదటి పెద్ద సవాలు. పిల్లల మాట తీరు, వారు వ్యవహరించే తీరే పెద్దల పెంపకాన్ని ప్రతిబింబిస్తుంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీ స్నేహితులు లేదా బంధువులతో సంభాషించేటప్పుడు అసభ్యంగా ప్రవర్తించకుండా చూసుకోవాలి.
అభ్యర్థన చేస్తున్నప్పుడు ‘ప్లీజ్’ అనమని మీ పిల్లలకు నేర్పండి. మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్లీజ్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించండి. ఇది ఈ పదం ఎక్కడ, ఎప్పుడు… ఉపయోగించాలో వారికి అర్థమయ్యేలా చేస్తుంది. కుటుంబంలోని మిగిలిన వారు ప్లీజ్ అనే పదాన్ని ఉపయోగిస్తే, పిల్లలు దానిని సొంతంగా ఎంచుకుంటారు.
ఎక్స్‌క్యూజ్ మీ… పిల్లలు ఎవరో దృష్టిని కోరుకున్నప్పుడు లేదా ఇతరులు తమ మాట వినాలని కోరుకున్నప్పుడు, వారు దయచేసి ‘క్షమించు’ అనే పదాన్ని ఉపయోగించాలని పిల్లలకు నేర్పండి.
క్షమాపణ ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పడం చాలా అవసరం. మీరు మీ పిల్లలతో సారీ అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తే చాలా మంచిది. అప్పుడు మీ పిల్లలు తప్పు చేసినప్పుడల్లా క్షమాపణ చెప్పడం నేర్చుకుంటారు.
ఒకరి వస్తువులను తీసుకునే ముందు మీ బిడ్డ వారి పర్మిష్ కోరాలని తెలియజేయండి. మీ పిల్లలు ఈ అలవాటును నేర్చుకునేలా చేయడానికి, మీరు వారి వస్తువులను తీసుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి. ఉదాహరణకు నేను మీ పెన్సిల్ తీసుకోవచ్చా? లేదా నేను మీకు ఆహారం ఇవ్వవచ్చా? ఇది మీ పిల్లలలో అనుమతి కోరే అలవాటును కలిగిస్తుంది.
వారి కంటే పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మధ్యలో మాట్లాడకూడదని నేర్పించాలి. ఎదుటివారు మాట్లాడటం ముగించిన తర్వాత మాత్రమే మాట్లాడమని పిల్లలకు చెప్పాలి.
ఒత్తిడి పెట్టవద్దు
కొందరు తల్లిదండ్రుల వారి పిల్లలపై లక్ష్యాలు, ఆశయాలను బలవంతంగా రుద్దుతుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే చిన్నారులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా వారు చేయాలనుకున్న వాటిని చేయలేకపోతుంటారు. అంతేకాదు ఒత్తిడి కారణంగా వాళ్లలో క్రియేటివిటీ దెబ్బ తింటుంది. కాబట్టి వాళ్ల ఆసక్తిని గుర్తించి, వారిని ఎంకరేజ్ చేయాలి.