పీడిత ప్రజల గొంతుక సీపీఐ(ఎం)ను గెలిపించండి

– కార్పొరేట్‌ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను ఓడించండి
– సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి కారం పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
బడా కార్పొరేట్‌ శక్తులకు నాయకత్వం వహిస్తున్న బిజెపి, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను ఓడించి అనునిత్యం ప్రజల పక్షాన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఐ(ఎం)ని గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని పౌలూరుపేట, పాత నారాయణరావుపేట, కొత్త నారాయణరావుపేట, గుర్రాల బైలు, సింగారం, వైట్‌ నాగారం, నిమ్మలగూడెం గ్రామాలను పర్యటించి తన గెలుపుకు సహకరించాలని, తద్వారా ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా పరిష్కరించే అవకాశం దొరుకుతుందని ఆయన తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, పుల్లయ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న సిపిఐ(ఎం) పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపించడం ద్వారా ప్రజా పోరాటాలకు మరింత బలం చేకూరుతుందన్నారు. తద్వారా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలతో పాటు చట్టసభల్లో కూడా పోరాటం చేసి హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. నాడు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డమీద ఎర్రజెండా నాయకత్వంలో అనేక ప్రజా పోరాటాలు నిర్మిస్తున్నామని విజయాల సాధిస్తున్నామని, పోరాటాలే ఊపిరిగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమరశీలంగా ఉద్యమిస్తున్న సిపిఐ(ఎం) పార్టీని ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి కామ్రేడ్‌ కారం పుల్లయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో నాయకులు మర్మంచంద్రయ్య, బొల్లి సూర్యచంద్రరావు, మారాయిగూడెం సర్పంచ్‌ తిరుపతిరావు, సరియం ప్రసాద్‌, ఉబ్బ భద్రయ్య, సరియం సీతారామయ్య, బొల్లి సత్యనారాయణ, అర్జున్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.