మనువాద రాజ్యాంగాన్ని వ్యతిరేకిద్దాం…భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

– కొత్తగూడెం జిల్లా సదస్సులో పలువురు వక్తలు
నవతెలంగాణ-కొత్తగూడెం
మనువాద రాజ్యాంగాన్ని వ్యతిరేకిద్దామని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని, భారత్‌ బచావో అంటు పలువురు వక్తలు ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తగూడెంలో జిల్లా సదస్సు నిర్వహించారు. స్థానిక సూర్యా ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌ నందు మల్లెల రామనాథం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత్‌ బచావో నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.ఎఫ్‌ గోపీనాథ్‌, తాళ్లూరు వెంకటేశ్వరరావు, గొల్లపల్లి దయానంద్‌, అబ్దుల్‌ బాసిత్‌, రమేష్‌ కుమార్‌ మక్కాడ్‌ తదితరులు మాట్లాడుతూ మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రం సంపాదించి ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ తదితర అన్ని రకాల అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందించి ఈ దేశంలో సామాజిక న్యాయం సాధించాలని కలలు గన్నారన్నారన్నారు. కానీ నేటి పాలకులు రైతుల నిరుద్యోగుల కార్మికుల బతుకులను బజారు పాలు చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా క్రింది వర్గాల ప్రజలను కనీసం మనిషిగా చూడని దుర్మార్గపు మనువాదాన్నే రాజ్యాంగంగా తేవాలని శరవేగంగా పావులు కదుపుతున్నారని తెలిపారు. దేశ స్వాతంత్ర కోసం పోరాటం చేసిన గాంధీని చంపిన గాడ్సే కు జిందాబాద్‌లు కొడుతూ గుడులు కట్టిస్తున్నారని మండిపడ్డారు. గాంధీ, అంబేద్కర్‌లను దేశద్రోహు లంటూ చిత్రపటాలను కాల్చివేస్తున్నారని, ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన కలుగుతుందన్నారు. మన దేశంలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌ ఇతర మతాల ప్రజల పైన దాడులు చేయడంవల్ల ఇతర దేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న కోట్లాది మంది మన దేశ ప్రజల బ్రతుకులు ఏమవుతాయో అని సదస్సులో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నిత్య అవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సదస్సులో డాక్టర్‌ బత్తుల కృష్ణయ్య, మండవ సుబ్బారావు, కొల్లి నాగేశ్వరరావు, న్యాయవాది కోటం రాజు, సలిగంటి శ్రీనివాస్‌, భూక్య రమేష్‌, వెంకటేశ్వర్లు, చారువాక, రామాచారి, నబిసాహెబ్‌, దేవదానం, సురేందర్‌, శ్రీనివాస్‌, స్వామి దాస్‌, నాగేశ్వరరావు విశ్వనాథం అమీద్‌, మోయిన్‌ నాజర్‌, రమేష్‌, తదితర పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.