మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో అనేక రకాల పిండి వంటలను చేసుకోవచ్చు. అందులో వడలు చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ వంటకాలు ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. ఇప్పుడే ట్రై చేయండి..
జొన్నలతో…
కావలసిన పదార్థాలు : జొన్న పిండి – కప్పు, ఉల్లికాడ – అర కప్పు, ఉల్లిగడ్డ – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – చెంచా, జిలకర – చెంచా, గరం మసాలా – అర చెంచా, కారం – అర చెంచా, పసుపు – అర చెంచా, పచ్చి శనగ పప్పు లేదా స్వీట్ కార్న్ – అర కప్పు, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, ఉల్లికాడలు (లేకపోతే స్కిప్ చేయండి) వేయాలి. అందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారంపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద అన్ని వేసి బాగా కలుపుకోవాలి. నీటిని వాడకుండానే పిండి మొత్తాన్ని కలపాలి. కలిపే క్రమంలో అవసరాన్ని బట్టి కొంచెం నీటిని యాడ్ చేసుకోవాలే తప్ప ముందు పోయకూడదు. పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి పిండిని చిన్న చిన్న ముద్దలుగా విభజించుకుని వడల్లా చేసుకుని నూనెలో వేయాలి. దోరగా వేగాక తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
అలసందలతో….
కావలసిన పదార్థాలు : అలసందలు – రెండు కప్పులు, పచ్చిపప్పు – ముప్పావు కప్పు, బచ్చలికూర లేదా మునగ ఆకులు – రెండు కప్పులు (ఆకులు చిన్నగా కట్ చేసుకోవాలి), ఎర్ర మిరపకాయలు – రెండు లేదా మూడు (కారాన్ని బట్టి) పచ్చిమిర్చి – రెండు లేదా మూడు (కారాన్ని బట్టి), అల్లం, వెల్లుల్లి పేస్టు – చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, ఉల్లిగడ్డ – రెండు (మీడియం సైజు), కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర – పావు కప్పు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ఒక గిన్నెలోకి వడలు తీసుకోని కడిగి నాలుగు నుంచి ఐదు గంటలు నాననివ్వాలి. కొంత మందికి పొట్టు ఉంటే నచ్చదు. అలా నచ్చని వాళ్ళు పొట్టు పోయేదాకా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చి పప్పును ఒక గంట నానబెట్టి, కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి మిక్సి జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేరొక జార్లో ఎర్ర మిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి అందులో కలపాలి. ఇందులోనే ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర తరుగు, బచ్చలికూర లేదా మునగ ఆకుల తరుగు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడయ్యాక, పిండిని వడల్లా చేత్తో వత్తి నూనెలో వేయాలి. బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకుని తీసేయాలి.
ఊదలతో…
కావలసిన పదార్థాలు : పచ్చిపప్పు – ముప్పావు కప్పు, ఊదలు – కప్పు, దనియాలు – రెండు చెంచాలు, అల్లం – అంగుళంన్నర ముక్క, పచ్చిమిర్చి – రెండు లేదా మూడు, ఉల్లిగడ్డలు – రెండు, జీలకర్ర – చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడ, తినే సోడ – కొద్దిగా
తయారు చేసే విధానం : ఊదలు నాలుగైదు గంటలు నానబెట్టాలి. పచ్చిపప్పు గంట పాటు నాననివ్వాలి. రెండింటినీ నీటి నుండి వేరు చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు చెంచాల దనియాలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసి అన్నింటిని బాగా కలపాలి. వీటిని మిక్సి జార్లోకి తీసుకుని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, జిలకర్ర, తినే సోడా వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె పోసి బాగా వేడయ్యాక కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తడి చేసుకుంటూ వడల మాదిరిగా చేసుకోని నూనెలో వేసి దోరగా కాల్చుకోవాలి. అంతే… ఊదల వడలు రెడీ.