టిక్కీ తినేద్దామా…!

టిక్కీ తినేద్దామా...!చల్లదనానికి కాస్త వేడి వేడిగా ఏవైనా తాగాలని, తినాలని అనిపిస్తుంటుంది. అయితే ఎప్పుడు చేసుకునే పకోడి, బజ్జీలే కాకుండా కాస్త హెల్దీగా ఉండే స్నాక్స్‌ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందులో రాజ్‌మా, పాలకూర, సోయా వంటి వాటిని చేర్చుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా… మరెందుకు ఆలస్యం… వీటితో టిక్కీలు చేసుకుందాం…
ఆలూ, అన్నంతో..
కావాల్సిన పదార్థాలు : ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం – రెండు, ఆలు – (ఉడికించినవి) రెండు పెద్దవి, కారం, మిరియాలపొడి అరచెంచా చొప్పున, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – మూడు, నూనె – అరకప్పు, ఉల్లిపాయలు – రెండు, ఉప్పు – తగినంత, అన్నం – కప్పు, కొత్తిమీర – కట్ట, పెరుగు – అరకప్పు, ఎండు మిర్చి – ఒకటి
తయారు చేసే విధానం : కడాయి స్టవ్‌ మీద పెట్టి రెండు చెంచాల నూనె వేడి చేసి ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలూ, ఎండు మిర్చి ముక్కలూ వేసి కొంచెం సేపు వేయించాక, మిరియాలపొడీ, కారం, తగినంత ఉప్పూ, పచ్చిమిర్చి తరుగూ వేసి కలుపుకోవాలి. క్యాప్సికం ముక్కల్లోని పచ్చివాసన పోయాక వీటన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో అన్నం, ఉడికించిన ఆలూ, పెరుగూ, కొత్తిమీర తరుగూ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టిక్కీల్లా అద్దుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి.. రెండు టిక్కీలను ఉంచి.. కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుంటే సరి.
రాజ్‌మా, క్యాప్సికంతో..
కావాల్సిన పదార్థాలు : రాజ్మా గింజలు – రెండు కప్పులు, బ్రెడ్‌పొడి – కప్పు, క్యాప్సికం – రెండు, జీలకర్రపొడి, గరం మసాలా – ఒకటిన్నర చెంచాల చొప్పున, మిరియాలపొడి – చెంచా, ఎండుమిర్చి చెంచా, ఉప్పు – తగినంత, అల్లం తరుగు – చెంచా, వెల్లుల్లి ముక్కలు – రెండు చెంచాలు, కొత్తిమీర- రెండు కట్టలు, పుదీనా – కట్ట, మైదా – ముప్పావుకప్పు, నూనె – కప్పు.
తయారు చేసే విధానం : రాజ్మాను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు ఆ నీటితో సహా కుక్కర్‌లో వేసి, ఎనిమిది నుంచి పది విజిల్స్‌ వచ్చే వరకు ఉంచి దింపేయాలి. వేడి చల్లారాక రాజ్మాను మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. అందులో నూనె, మైదా, బ్రెడ్‌ పొడి తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇంతలో మైదా పిండితో పాటు సరిపడా నీళ్లు పోస్తూ గరిటె జారుగా (లైట్‌ లూజ్‌ బాటర్‌) చేసుకుని పెట్టుకోవాలి. నానిన రాజ్మా మిశ్రమాన్ని ఫ్రిజ్‌ లోంచి తీసుకుని చిన్నచిన్న టిక్కీల్లా చేసుకోవాలి. ఒక్కో దాన్ని మైదా మిశ్రమంలో ఉంచి.. తర్వాత బ్రెడ్‌ పొడి అద్దాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుని, పెనం మీద ఉంచి, నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చి తీసుకుంటే చాలు. అయితే పెనం మీద పెట్టే ముందే వీటిని మైదా మిశ్రమంలో ముంచాలి. లేదంటే నానిపోయి.. టిక్కీ ముద్దలా అయిపోతుంది.
పనీర్‌, బఠాణీలు..
కావాల్సిన పదార్థాలు : బఠాణీలు – అరకప్పు (ఎండు బఠాణీలు అయితే ఆరు గంటల ముందు నాన బెట్టి, ఉడికించి, ముద్దలా చేసుకోవాలి), పనీర్‌ తురుము – కప్పు, నెయ్యి – ఒకటిన్నర చెంచా, జీలకర్ర – చెంచా, అల్లం తరుగు – రెండు చెంచాలు, పచ్చిమిర్చి – రెండు, జీలకర్రపొడి, కారం – చెంచా చొప్పున, ఉప్పు – తగి నంత, జీడి పప్పు, కిస్మిస్‌ పలుకులు – పావు కప్పు, కొత్తి మీర – కట్ట (సన్నగా తరగాలి), దాల్చినచెక్క పొడి – అర చెంచా, మొక్కజొన్న పిండి – చెంచా, నూనె – అర కప్పు,
తయారు చేసే విధానం : కడాయిని స్టవ్‌ మీద పెట్టి.. నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీలకర్రా, అల్లం తరుగూ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి వేగాక ఉడికించి ముద్దలా చేసుకున్న బఠాణీల మిశ్రమం, జీలకర్ర పొడి, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక జీడిపప్పు, కిస్మిస్‌ పలుకులూ, కొత్తిమీర తరుగూ వేసి కలిపి దింపేయాలి. ఇందులో పనీర్‌ తురుము, దాల్చినచెక్కపొడి వేసి ముద్దలా కలుపు కోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. బఠాణీల మిశ్రమాన్ని టిక్కీల్లా ఒత్తు కోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేయాలి. ఒక్కో టిక్కీని తీసుకుని మొక్కజొన్నపిండిలో ముంచి.. పెనం మీద ఉంచి, నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మిగిలినవీ చేసుకోవాలి.
పాలకూర, శెనగలు..
కావాల్సిన పదార్థాలు : పాలకూర – ఐదు కట్టలు, శెనగలు – అర కప్పు, పచ్చి మిర్చి – రెండు, వెల్లుల్లి – ఐదు, ఉప్పు – తగినంత, గరంమసాలా – రెండు చెంచాలు, చాట్‌ మసాలా – ఒకటిన్నర చెంచా, చీజ్‌ – అరకప్పు, నూనె – ముప్పావుకప్పు, బ్రెడ్పొడి – కప్పు
తయారు చేసే విధానం : పాలకూరను సన్నగా తరిగి.. ఆరబెట్టుకోవాలి. పాలకూరలో తడిపోయాక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ జార్‌లోకి తీసుకుని ముద్దలా చేసుకో వాలి. తర్వాత నానబెట్టి, ఉడికించిన శెనగల్ని అందులో వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ ముద్దను ఓ గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు, గరంమసాలా, చాట్‌ మసాలా, బ్రెడ్‌ పొడి వేసి బాగా కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. పదిహేను నిమిషాలయ్యాక కొద్దిగా పాలకూర ముద్దను తీసుకుని చిన్న టిక్కీలా అద్దుకుని, అందులో చీజ్‌ని కొద్దిగా ఉంచి.. మళ్లీ టిక్కీలా అద్దుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి. ఇప్పుడు పెనం స్టవ్‌ మీద పెట్టి.. రెండు రెండు టిక్కీల చొప్పున ఉంచి.. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి.
సోయా, అటుకులతో…
కావాల్సిన పదార్థాలు : అటుకులు – కప్పు, సోయా కీమా – అరకప్పు, నూనె కప్పు, జీలకర్ర – చెంచా, అల్లం తరుగు – రెండు చెంచాలు, పచ్చిమిర్చి – మూడు, ఉల్లిపాయ – ఒకటి, కారం – అరచెంచా, పసుపు – పావు చెంచా, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా – అరచెంచా చొప్పున, ఉప్పు – తగినంత, నిమ్మరసం – ఒకటి న్నర చెంచా, ఉడికించిన ఆలూ- రెండు, మొక్కజొన్న పిండి – రెండు చెంచాలు
తయారు చేసే విధానం : కడాయిని స్టవ్‌ మీద పెట్టాలి. వేడయ్యాక రెండు చెంచాల నూనె వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అన్నీ వేగాక ఉల్లి పాయముక్కలు వేయాలి. అవి కూడా కొద్దిగా వేగాక కారం, పసుపు, ఆమ్‌ చూర్‌పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. నిమిషం తర్వాత అటుకులూ, సోయా కీమా వేసి కాసిని నీళ్లు చల్లుతూ ఉండాలి. కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేయాలి. అన్నీ బాగా కలిశాక ఉడికించిన ఆలు, మొక్కజొన్న పిండి వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని గుండ్రని టిక్కీల్లా చేసుకోవాలి. వీటిని పెనంపై ఉంచి.. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చి తీసుకోవాలి.