నేడు చలో హైదరాబాద్‌

– 13, 15 తేదీలలో ఎమ్యెల్యే ఇండ్ల ముందు ధర్నాలు
– వేతనాలు పెంచకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలు
– సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే మరో సమ్మె తప్పదు
– సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-కొత్తగూడెం
వేతనాలు పెంచకుండా కార్మికుల శ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంచాలని డిమాండ్‌ చేస్తు, ఈనెల 9న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే మరో సమ్మె తప్పదని, ఈ నెల 13, 15వ తేదీలలో ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేయనున్నట్లు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు హెచ్చరించారు. ఆదివారం స్థానిక సిఐటియూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న 30 వేల సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి, వారి వేతనాలను పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయన్నారు. 10 సంవత్సరాలు గడుస్తున్నా కనీస వేతనాల జీవోలను విడుదల చేయకుండా వెట్టి చాకిరీ చేయిస్తూ కోట్ల రూపాయల లాభాలను గడిస్తున్నారని విమర్శించారు. 2021 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 22ను విడుదల చేసిన సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ గెజిట్‌ చేయకుండా కార్పొరేటర్ల కొమ్ము కాస్తూ కార్మికుల పొట్టలు కొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో కర్కషంగానే వ్యవహారిస్తు జాతీయ కనీస వేతనం రోజుకు రూ.178లుగా నిర్ణయం చేసి కార్మికుల బతుకులను ఆగం చేయాలని చూస్తుందన్నారు. ఒక వైపు ఎడతెరిపి లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, మరో వైపు విపరీతమైన పనిభారం పెంచుతూ కార్మికుల వేతనాలు మాత్రం గొర్రెతోక బెత్తెడు చందంగానే ఉంచుతున్నారు. ఈ మధ్య కాలంలో భరించలేని పని భారం, కుటుంబాన్ని సాదుకోలేని వేతనాలతో మానసికంగా మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పారు. వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియుగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. జీవో నెంబర్‌ 22ను గెజిట్‌ చేయించి కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాము. దీనికోసం ఈ నెల 9 హైదరాబాద్‌ రాష్ట్ర లేబర్‌ కమీషనర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పాల్గోనాలని పిలుపు నిచ్చారు. 2022 సెప్టెంబర్‌ 26 నసింగరేణి యాజమాన్యం చేసిన అగ్రిమెంట్‌ లోని బోనస్‌ పెరుదల, క్యాటగిరైజైషన్‌ సెలవులు, నర్సిరీ కార్మికుల వేతనాలు అంశాలను నేటికి అమలు చేయలేదు.2022-23 సంవత్సరానికి సింగరేణి సాధించిన రూ.2,222 కోట్ల లాభాలలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ వున్నదని తెలిపారు. లాభాలలో 32 శాతం వాటను పర్మినెంట్‌ కార్మికులకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు ఆన్యాయం చేసింది. పర్మినెంటు కార్మికులకు లాభాల వాటా ఇస్తున్నట్లే కాంట్రాక్టు కార్మికులకు కూడా 20 శాతం బోనస్‌ లేదా లాభాల వాటాను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు పెరుగుదల, ఒప్పందం అమలు, లాభాల వాట కోసం ఈనెల 13,15వ తేదిల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్‌ బెల్ట్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయం, ఇండ్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని దీనిలో కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి, వేతనాలను పెంచకుంటే సింగరేణిలోమరో సమ్మెకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు కె. బ్రహ్మాచారి, డి.వీరన్న, నభీ, సక్రాం, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.