ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

– విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలి
– సర్వీసు పర్సన్లను నియమించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘పిల్లలుంటేనే బడి ఉంటుంది. ప్రభుత్వ బడులను కాపాడుకుందాం’అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 2023-24 విద్యా సంవత్సరం సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల మూడో తేదీ నుంచి బడిబాట ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు ఇతోధిక కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నమోదు తగ్గుతున్నదని పేర్కొన్నారు. 21వ శతాబ్ద ప్రారంభం నుంచి తల్లిదండ్రుల్లో వారి పిల్లలను ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదివించాలనే కోరిక పెరుగుతూ వస్తున్నదని తెలిపారు. దీంతో తెలుగు మాధ్యమంలో విద్యార్థుల నమోదు తగ్గుతున్నదని వివరించారు. గత విద్యాసంవత్సరం లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. అయినా విద్యార్థులు ఇబ్బడిముబ్బడిగా చేరుతారని భావించలేమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరారు. ప్రతి బడికి పాఠశాల విద్యాశాఖ నుంచే సర్వీసు పర్సన్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేస్తే బడుల్లో విద్యార్థుల సంఖ్య కొంత మేరకు పెంచొచ్చని పేర్కొ న్నారు. గత రెండేండ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలున్నాయని వివరించారు. పాఠశాల ఉన్న ఆవాసం, గ్రామంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రయివేటు బడులకు వెళ్తే ఉపాధ్యాయుల ప్రత్యేక కృషితో ప్రభుత్వ స్కూళ్లలో చేరతారని సూచించారు. ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు భరోసానిచ్చే కృషి చేయాలని కోరారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల మనుగడ కొనసాగుతుందని తెలిపారు.
1,290 ప్రాథమిక పాఠశాలల్లో సున్నా ప్రవేశాలు
18,235 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1,290 బడుల్లో ఒక్క విద్యార్థి లేరని నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 1,686 బడుల్లోనే తరగతికో టీచర్‌ ఉన్నారని వివరించారు. కానీ ప్రయివేటు పాఠశాలల్లో తరగతికొక గది, టీచర్‌ తప్పనిసరిగా ఉంటారని తెలిపారు. విద్యార్థుల సంఖ్య 41 నుంచి 60 వరకు ముగ్గురు, 61 నుంచి 90 వరకు నలుగురు, 90కిపైగా ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులుండేలా ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఇందుకోసం ఆరు వేల మంది ఎస్జీటీలు అవ సరమౌతారని పేర్కొన్నారు. 2015లో రేషనలైజేషన్‌ లో ఏడు వేల ఎస్జీటీ పోస్టులు డీఈవో పూల్‌లో ఉంచారని, అవి సరిపోతారని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 1,467 ప్రాథమిక పాఠశాల లున్నాయని తెలిపారు. పదిలోపు, 20లోపు విద్యార్థు లున్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నా రు. 60 మంది విద్యార్థులుండేలా పాఠశాలలను ఐక్యం చేసి ఐదుగురు టీచర్లుండేలా ఏర్పాటు చేయా లని సూచించారు. 3,152 ప్రాథమికోన్నత పాఠశాల ల్లో 2,236 బడుల్లో వందలోపు విద్యార్థులున్నారని తెలిపారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేని చోట ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. మిగిలిన వాటిని ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్‌ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. 4,691 ఉన్నత పాఠశా లల్లో 125 మందిలోపు విద్యార్థులున్నవి 2,150 ఉన్నాయని, వాటిపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిం చాలని కోరారు. 200లోపు విద్యార్థులున్న 122 ఆశ్రమ పాఠశాలలపై గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.