దేశాన్ని బతికించుకుందాం

రాలిన ఆకు మీద
దగ్గరగా ఒత్తిల్లుకొని
తలవంచి మొలకెత్తే
చిరు మొలకలం
మూరెడు నీడ
జానెడు కడుపు
తీరని బతుకులాటలో
పండు రాలుతున్నం
అడవులో లోయలో
పర్వతాలో సముద్రాలో
ప్రమాదాలకు ప్రాణం ఫణం చేసి
గిరిగిసుకున్నోళ్లం
ప్రజలం సార్‌ ప్రజలం
నాటి
నిండు సభను దాటి
నేడు
వలువలొలిచారు సార్‌
వలువలొలిచారు
వీళ్ళనేమనాలి ?
బజార్లు తిప్పారు సార్‌
బజార్లు తిప్పారు
అమ్మలు గుర్తు రావాలి కదా సార్‌ !
అక్క చెల్లెల్లు గుర్తు రావాలి కదా సార్‌ !
కారే నెత్తుటి బొట్టులో
పోయే శ్వాస చలినెగళ్ళలో
తనను తాను చూసుకోవాలి కదా సార్‌
మా ప్రాణం !
యాత్ర నార్యంతైనా
మననం కావాలి కదా సార్‌ !
గార్గి మైత్రేయి
మహామహుల దేశంలో
సామాన్యులం
మన దాకా వచ్చినాంక
నమ్మకమెట్లా కుదరాలే సార్‌ !
రాచరికం వద్దనుకున్నాం
నియంతత్వం కాదనుకున్నాం
రాజ్యాంగం రాసుకున్నాం
ప్రజాస్వామ్యం కోరుకున్నాం
అంతా ఉట్టిదే అయితే
దేశం ఒక అబద్ధం !
పాలన ఒక వంచన !
బతికించుకుందాం సార్‌
మనం బతికించుకుందాం
దేశాన్ని బతికించుకుందాం.
– బెల్లంకొండ సంపత్‌ కుమార్‌
9908519151