మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి పని చేద్దాం

– సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌ పాష
– రాహుల్‌ జూడో యాత్రకు సంఘీభావ ర్యాలీ
నవతెలంగాణ-పాల్వంచ
రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్రకు సంఘీభావంగా ఆదివారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాల్వంచలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిపిఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌ పాష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ నాయకత్వంలో రెండవ దశ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వారికి మద్దతుగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి తమ పూర్తి సంఘీభావాన్ని తెలుపుతున్నామన్నారు. దేశంలో మతవిద్వేషానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య ప్రేమను పెంచడానికి రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో న్యాయ యాత్రను జయప్రదంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాల్వంచ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూకల రంగారావు మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్రకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయ అసమానతలు, ఆర్థిక సమస్యలు, మత విద్వేషాలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ చేపట్టిన యాత్రకు సంఘీభావంగా నేడు పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు, సిపిఐ నాయకులు, కాంగ్రెస్‌ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అయిత గంగాధర్‌ రావు, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు సయ్యద్‌ అబ్దుల్‌ జలీల్‌, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్‌ ఎండి మంజూరు, సిపిఐ పార్టీ పాల్వంచ మండల కార్యదర్శి విసంశెట్టి పూర్ణచంద్రరావు, కాంగ్రెస్‌ నాయకులు ఓలపల్లి రాంబాబు, కొమ్మరరాజు విజరు, లోగాని మురళి తదితరులు పాల్గొన్నారు.