నవ తెలంగాణ -బూర్గంపాడు
బూర్గంపాడు మండలం ఇరవెండి పంచాయతీకి ‘లైట్ హౌజ్’ పురస్కారం లభించింది. దేశ వ్యాప్తంగా 75 పంచాయతీలను ఈ విభాగంలో ఎంపిక చేయగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు పంచాయతీలు ఉండగా వాటిలో ఇరవెండి ఒకటి. రాష్ట్రంలోనే ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి పంచాయతీగా ఇరవెండి నిలిచింది. ఈ పురస్కారానికి మొత్తం నాలుగు అంశాలు ప్రాతిపదికగా తీసుకు న్నారు. వీటిలో ఓడీఎఫ్, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ, పారిశుధ్యం ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నాలుగు అంశాలను త్వరితగతిన పూర్తి చేయడంతో ఈ గుర్తింపు లభించింది. సోమవారం ఇరవెండి గ్రామ పంచా యతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో అధికారుల సమక్షంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. లైట్ హౌజ్ సాధించడంలో సారపాకలోని – ఐటీసీ కర్మాగారం చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్ర మంలో ఇరవెండి గ్రామ సర్పంచ్ కొర్సా లక్ష్మి, కార్యదర్శి దివ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణ, ఐటీసీ అడ్మిన్ అధికారి చెంగల్రావు, ఎంఎస్కే అధికారి జయ ప్రకాష్, స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ రేవతి, ఎంపీవో సునీల్ కుమార్, ఈజీఎస్ ఏపీవో విజయ లక్ష్మి, స్థానికులు తాళ్ళూరి రాధాకృష్ణ, మాడపాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.