ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

– సెలెక్టెడ్‌ అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 11 లోపు వివరాలు పొందుపర్చాలి
– టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ బోర్డు చైర్మెన్‌ వివి.శ్రీనివాసరావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌, ఏఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం  ప్రకటించింది. మొత్తం ఎంపికైన 587 అభ్యర్థుల (434 పురుష+153 మహిళా అభ్యర్థులు) కటాఫ్‌ మార్కులతో సహా జాబితాను సోమవారం తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in లో పొందుపర్చనున్నట్టు బోర్డు చైర్మెన్‌ వివి.శ్రీనివాసరావు తెలిపారు. ఆ అభ్యర్థుల పూర్తివివరాలతో కూడిన పత్రాన్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని తెలిపారు. దాని ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు అడిగిన వివరాలను వెబ్‌సైట్‌లో ఈనెల 8 నుంచి11 వ తేదీ వరకు పొందుపర్చాలని సూచించారు. అంతేగాక, ఆ పత్రాలకు సంబంధించిన మూడు కాఫీలను డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిలో చెప్పబడిన చోట ఫొటోలను అతికించి గెజిటెడ్‌ అధికారుల సంతకాలను తీసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. వాటిని 14వ తేదీన వెబ్‌సైట్‌లో పేర్కొన అధికారుల వద్ద సమర్పించాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి వారి సర్టిఫికెట్లు, ఇతర ధ్రువ పత్రాలు నిర్ధారణ, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపికకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు చెందిన అభ్యర్థులు రూ.2వేలు, బీసీ, ఇతర సామాజిక తరగతుల వారు రూ.3 వేలు చెల్లించి తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వివరణ కోరవచ్చునని తెలిపారు. సంబంధిత అభ్యర్థులకు వెబ్‌సైట్‌లో కేటాయించిన అకౌంట్‌లలో వివరణ ఇస్తామని పేర్కొన్నారు.