– ఎవరి గురించి రాశామో వారితోనే ఆవిష్కరణలు : సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ- కల్చరల్
సబ్బండ వర్ణాలు, వృత్తి కులాల కోసమే సాహిత్య సృష్టి చేసినప్పుడు అది వారి వద్దకు చేరుకుంటే అంతకన్నా సాహిత్యానికి వేరే ప్రయోజనం లేదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలోని సాహిత్య అకాడమీలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపట్ల సుబ్బయ్య రాసిన ‘బహుజన బావుటా’, దామెర రాములు రాసిన ‘నేను సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నాను’ దీర్ఘ కవితలను తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిందని చెప్పారు. వాటిని చేతివృత్తుల వారిచే రాష్ట్రంలోని 33 జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలతో కలిపి మొత్తం 150 ప్రాంతాల్లో ఆవిష్కరింపజేశామన్నారు. జ్యోతిబాఫూలే, సావిత్రిబా ఫూలేలు బడుగు బలహీన బహుజన వర్గాల ప్రజలకు అమ్మానాన్నల వంటి వారని చెప్పారు. అలాంటి త్యాగధనులపై రాసిన పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించిందని వివరించారు. కష్టజీవుల కన్నీళ్ళ కథలే నిజమైన ప్రజా సాహిత్యమనీ, కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్రవత్తుల, సబ్బండ వర్ణాలకు సంబంధించిన పుస్తకాలు ప్రచురించి, ఆ పుస్తకాలను ఆ చేతివృత్తుల వారితో ఆవిష్కరింపజేయడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లి విరిసిందని తెలిపారు. తెలంగాణాతోపాటు మహారాష్ట్రలోని ముంబయిలో డా.అంబేద్కర్ ఇంటి ముందు ఆవిష్కరించి నట్టు చెప్పారు. అలాగే జ్యోతీబాఫూలే తిరుగాడిన పూణేలో, సావిత్రిబా ఫూలే విశ్వవిద్యాలయంలోని విగ్రహం వద్ద ఆవిష్కరణలు జరిగినట్టు తెలిపారు. నాందేడ్, షోలాపూర్, నాగపూర్లతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ పుస్తకావిష్కరణ జరిగిందన్నారు. ఎవరి గురించి సాహిత్యం రాయబడిందో వాళ్ల వాకిలి వద్దకు చేర్చాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకు పోవాలన్న సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగు ణంగా సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింద న్నారు. సామాజిక చైతన్యాన్ని కలిగించే సాహిత్యం బతుకుల ను మార్చుకునే ప్రేరణ అవుతుందన్నారు. తెలంగాణ భూమిలో ఉన్న విలువైన యక్షగానాలు, జముకుల కథల వంటి అనేక కళారూపాలు, సాహిత్య ప్రక్రియల సంపదను వెలికితీసే బృహత్తర బాధ్యత ఉందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఇంతకు ముందు గిరిజన కథా సంకలనం ”కేస్లా కథలు” తీసుకొచ్చిందని, విస్తృత సాహిత్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయని చెప్పారు. ”మనవూరు-మనచెట్లు” కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు తమ ఊరిలోని చెట్ల గురించి కథలు రాశారని, 33 జిల్లాల బాలసాహిత్యాన్ని 33 పుస్తకాలుగా ఈ నెలాఖరులోగా ప్రచురించి విడుదల చేస్తామని తెలిపారు.