– అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ భాషా-సాంస్కతిక, సాహిత్య అకాడమీ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివద్ది, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా ఆ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. గంగా జమునా తెహజీబ్‌ను ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు భాషల్లో రాష్ట్రస్థాయిలో 33 జిల్లాల్లో రచనం, పద్యం, ఉర్దూ కవిత్వంలో కవి సమ్మేళ నాలను నిర్వహించాలన్నారు. రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వ హించిన తర్వాత ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా రూ. 1,00,116, రెండో బహుమతిగా రూ.75,116, మూడో బహుమతిగా రూ.60,116, నాలుగో బహుమతిగా రూ.50,116, ఐదో బహుమతిగా రూ.30,116 అందించి కవులను, సాహితి వేత్తలను ప్రోత్సహించాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ కవితలను కలిపి పుస్తక రూపంగా తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు.