”నాకు ఒకటే ఆశయం. నా రచనల వల్ల మనోవికాసం పొందదగిన తెలుగు వాళ్ళు ఉండి తీరాలి. వారందరూ నా కథలు చదవాలి. వారందరికీ నా రచనల మీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే తెలుగు సారస్వతానికి అంత ఉపయోగం చేసిన వాణ్ణవుతాను. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది. నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ ఏకోశానా లేదు. ఇంకా ఎప్పుడో పుట్టబోయే వాళ్ళ కోసం రాస్తున్నాననే అహంకారం కూడా నాకు లేదు. నేను ఆకాశం నుంచి ఊడిపడలేదు. నాకు పూర్వం కథలు రాసిన వారు ఎక్కడ విడిచి పెట్టారో నేను కథా రచనను అక్కడే అందుకోగలను కాని అంతకు పైన ఎట్లా అందుకోగలను?” 1937లో ‘కారుణ్యం’కు రాసిన ముందుమాటలో కొకు తన వైఖరిని స్పష్టం చేశారు.
ఆయన రచనల్లో కనిపించే విలక్షణత అభ్యుదయ దృక్పథం. వారి రచనలు ఆలోచనలను రేకెత్తిస్తాయి. ”రచయిత సమాజాన్ని ‘కుక్క కాపలా’ కాయటం కష్టమే” అనే కొకు వాక్యాల వెనుక ఎంతో లోతైన ఆలోచన కనబడుతుంది. 1930, 40 దశాబ్దాల్లో తెలుగు మధ్య తరగతి కుటుంబాలను నిశితంగా పరిశీలించి, వాటికి సంబంధించి ఎన్నో ఇతివృత్తాలను తన కథల్లో పరిచయం చేశారు. ఉదాహరణకి జాతకాలు – వాటి ప్రభావాలు, మత పరమైన మూఢ విశ్వాసాలు, పిల్లల్ని పెంచటంలో పెద్దవాళ్ళ మూర్ఖత్వాలు, సామాజిక స్పృహ లేని వ్యక్తులు, మధ్య తరగతి మానవ సంబంధాలు, వాటిల్లో ముఖ్యంగా స్త్రీ – పురుష సంబంధాలు, అందులో దాంపత్యేతర సంబంధాలు కొకు రచనల్లో వస్తువులు. సమాజంలో ఈ ఇతివృత్తాలు గతం కంటే నేడు అధికమయ్యాయి. ఈ కారణాల వల్లే కొకు సాహిత్యం గతం కంటే ఇప్పుడే ఎంతో అవసరం.
‘చదువు, వారసత్వం’
ఈ రెండూ కొకు రాసిన పెద్ద నవలలు. ‘చదువు’ నవల ఇతివృత్తం మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య జరిగిన సంఘటనలు, చోటుచేసుకున్న మార్పులను వివరిస్తుంది. ‘వారసత్వం’ నవల భర్త సహాయం అతి తక్కువగా ఉన్న ఒక గృహిణి, ఒక్కగానొక్క కొడుకును పెంచి పెద్దచేయటం ఇతివత్తంగా సాగుతుంది. ఈ రెంటిలోనూ పిల్లల పెంపకం మీద ఉపన్యాస ధోరణిలో కాకుండా పాఠకులు ఆలోచించేటట్టు తన నిశితమైన పరిశీలనలని మనముందు ఉంచుతారు రచయిత. ఉదాహరణకి, పిల్లలు పెరుగుతున్నకొద్దీ వారు తమ తల్లిదండ్రుల కన్న తోటి స్నేహితుల నుంచి ఎక్కువ నేర్చుకుంటారన్న విషయాలను వివరంగా చెబుతారు. పిల్లలు పెరుగే క్రమంలో వారు తమ నుంచి దూరమయిపోతున్నారని బెంగపడే తల్లిదండ్రుల ఆరాటాన్ని కూడా అందులో వర్ణిస్తారు. కొకు రచనల్లో ఒక శాస్త్రీయ దక్పథం కనపడుతుంది. అలా అని ‘పిల్లల్ని పెంచడంలో వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గాలు అన్న నీతిబోధ ధోరణిలో ఆ రచనలు లేకపోవడమే వాటి ప్రత్యేకత. కొకు విశిష్టత.
సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుండాలని చెప్పిన కొడవటిగంటి రచనలన్నీ సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చేవే. వచనంలో ఆయనది అందె వేసిన చేయి. కథ చెప్పడంలో ఏ రకమైన సంక్లిష్టతా వుండదు. వస్తువుపై ఆయనకున్న స్పష్టతే ఆయన శైలిలోనూ వ్యక్తమవుతుంది. ఆయన రచనలు సమకాలీన సామాజిక, ఆర్థిక పరిణామాలను ప్రతిబింబిస్తాయి. ఆయన వచనానికి ముందే చెప్పినట్టు పాఠకుడిని తన వెంట తీసుకుపోయే లక్షణం వుంది.
శైలిలోనూ, భాషలోనూ ఏ రకమైన సంక్లిష్టతా వుండదు. సామాన్య పాఠకులకు అర్థమయ్యే రీతిలో చక్కని శిల్పనైపుణ్యంతో ఆయన రచనలు సాగుతాయి. అభిప్రాయాలను నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా తన రచనతో స్పష్టంగా చెప్పారు. ఆయన కథలు రాయడానికి పెద్దగా కష్టపడినట్టు అనిపించదు. ఆయన సామాజిక పరిశీలనా శక్తి ఎంత సునిశితమైందో ఆయన రచనలు మనకు తెలియజేస్తాయి. సినిమా రంగంతోనూ, పత్రికా రంగంతోనూ ఆయనకు దగ్గరి పరిచయం వుంది. సినిమా బ్రతుకులను కూడా ఆయన రచనల్లో మనకు చూపించారు. కొకు రచనలను మనం తప్పకుండా చదవాలి. ఆయన కథలు, నవలలు సంపుటాలుగా వెలువడ్డాయి.
(అక్టోబర్ 28 కొ.కు. జయంతి సందర్భంగా)
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417