హైకోర్టులో విచారణ ప్రత్యక్ష ప్రసారం

– చారిత్రక ఘట్టం ప్రారంభం
నవతెలంగాణ – హైదరాబాద్‌
హైకోర్టు మరో చారిత్రక ఘట్టానికి తెర లేచింది. హైకోర్టులోని మొత్తం 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10.15 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరధే ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించగా, 10.30 గంటల నుంచి జరిగే కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం జరిగింది. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి సమయంలో హైకోర్టు కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల హైకోర్టులూ ఆదే విధానాన్ని ప్రారంభించాయి. కోవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత హైబ్రిడ్‌ పద్ధతిలో (ప్రత్యక్ష, భౌతిక విధానాలు) కేసుల విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని మొదటి కోర్టులో అప్పటి నుంచి హైబ్రిడ్‌ విధానం అమలు జరుగుతోంది. ఇప్పుడు మొత్తం 29 కోర్టుల్లోని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సోమవారం నుంచి ప్రారంభమైంది.
మెడికల్‌ ఫీజులపై మధ్యంతర ఉత్తర్వులు
మెడికల్‌ కాలేజీల్లో 2023-26 విద్యాసంవత్సరాలకు ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 107లో పేర్కొన్న ఫీజుల్లో ఏ కేటగిరీ సీట్లకు 60 శాతం, బీ కేటగిరీ సీట్లకు 70 శాతం చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తుది తీర్పునకు లోబడి ఉంటాయనీ, తుది తీర్పు మేరకు ఫీజుల చెల్లింపులు చేస్తామని విద్యార్థులు కాలేజీలకు హామీ పత్రం ఇవ్వాలని చెప్పింది. ఫీజుల పెంపును సవాలు చేస్తూ విద్యార్థులు వేసిన రిట్‌పై విచారణను వాయిదా వేస్తూ జస్టిస్‌ సుమలత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.