జాలితో పుట్టేది ప్రేమ కాదు

Love is not born of pityప్రేమ అనే పదంలో ఉండేది రెండు అక్షరాలు మాత్రమే అయినా దానికి చాలా శక్తి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ‘ప్రే’ అంటే ప్రేమించటం ‘మ’ అంటే మరిచిపోవడం అనుకుంటున్నారు చాలా మంది. సాధారణంగా ప్రేమ పుట్టేటపుడు చెప్పి రాదు. కానీ పోయేటప్పుడు మాత్రం చాలా అల్లకల్లోలం చేస్తుంది. ప్రేమ ఎలా పుడుతుందో చెప్పలేం. కొందరిలో స్నేహంతో ప్రేమ కలుగుతుంది. అయితే ఎదుటి వ్యక్తి మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా అవసరం కోసం వాడుకుంటున్నారా అనేది మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమస్యతో రెండు కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదువుకుందాం…
ప్రకాష్‌, పూజ ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగం చేసే వారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రకాష్‌కు పూజపై ప్రేమ ఎప్పుడు కలి గిందో తెలియదు. కానీ ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు. ప్రతిరోజూ ఆమెతో కొద్దిసేపైనా మాట్లాడాలి. ఇద్దరూ కలిసి సరదాగా బయటకు వెళ్ళేవారు. అప్పుడప్పుడు ప్రకాష్‌ పూజను వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్‌ చేసేవాడు. ఇద్దరి స్నేహం గురించి ఇరు కుటుంబాల్లో తెలుసు. ప్రకాష్‌కు అమ్మ, నాన్న, అక్క ఉన్నారు. అక్కకు పెండ్లి అయింది. ఆర్థికంగా బాగా స్థిరపడ్డ కుటుంబం వారిది. ప్రకాష్‌ ఉద్యోగం చేయకపోయినా వారికి వచ్చే కిరాయిలతోనే హాయిగా బతకొచ్చు. అవే నెలకు రెండు లక్షల వరకు వస్తాయి. ఇంకేంటి అంతా బాగానే ఉంది కదా! అనుకుంటున్నారా?
కానీ పూజకు అప్పటికే పెండ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో గొడవై వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంది. ఆ సమయంలోనే ప్రకాష్‌కు పూజ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పూజ భర్త పెద్ద తాగుబోతు, పని చేయడు. అనుమానపు భర్తను భరించలేక వచ్చేసింది ఆమె. ప్రకాష్‌ పూజ ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. అప్పుడు తెలిసింది అతనికి ఆమెకు పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని. పెండ్లయిన అమ్మాయిని ప్రేమించడం తప్పు అనుకున్నాడు. అప్పటి నుండి ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. దానికి పూజ కూడా ఒప్పు కుంది. కుటుంబసభ్యులు పెద్దల సమక్షం లో పంచాయితీ పెట్టి పూజను, పిల్లలను భర్తతో పంపించారు.
ఏడాది పాటు ఇద్దరూ బాగానే ఉన్నారు. మధ్య మధ్యలో ప్రకాష్‌తో ఫోన్‌లో మాట్లాడేది. భర్త తాగి వచ్చినపుడు ఆమెను కొట్టినపుడు ప్రకాష్‌కు చెప్పుకునేది. భార్యా భర్తల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. పూజ పిల్లలను తీసుకుని మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చేసింది. తిరిగి ఉద్యోగం చేయడం మొదలు పెట్టింది. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ప్రకాష్‌, పూజ తరచుగా కలుస్తుండేవారు. పూజ భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పింది. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో ఎవరికీ తెలియకుండా ఒక గుడిలో పూజ, ప్రకాష్‌ పెండ్లి చేసుకున్నారు. పూజ తనకు ఏదైనా అవసరమైతే ప్రకాష్‌కు ఫోన్‌ చేసేది. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళేవాడు. విషయం ఇంట్లో తెలిసి ప్రకాష్‌ని మందలిం చారు. ‘పెండ్లయి ఇద్దరు పిల్లలున్న అమ్మాయితో ఎందుకు తిరుగు తున్నావు, వేరే అమ్మాయిని చూసి పెండ్లి చేస్తాం’ అన్నారు. కానీ దానికి అతను ఒప్పుకోలేదు. ‘పూజ విడాకులు తీసుకుని నాతో పాటే ఉంటుంది. ఇంక నేను మరో పెండ్లి ఎందుకు చేసుకోవాలి’ అన్నాడు.
పూజతో ‘నీ భర్తకు వెంటనే విడాకులు ఇవ్వు. లేకపోతే మన విషయం అందరికీ చెబుతాను’ అంటూ బెదిరించాడు. దాంతో పూజ ప్రకాష్‌తో మాట్లాడటం మానేసింది. ఫోన్‌ నెంబర్‌ కూడా మార్చేసింది. ప్రకాష్‌ వాళ్ళ అమ్మ పూజకు ఫోన్‌ చేసి తిట్టింది. అందుకే ఆమె ప్రకాష్‌తో మాట్లాడటం మానేసింది. కానీ ప్రకాష్‌ ఆమెతో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేక పోయాడు. అది అతని బలహీనత. దాంతో అవసరం అయినపుడల్లా అతనితో మాట్లాడేది. ఒక రోజు సడన్‌గా ప్రకాష్‌ ఆఫీస్‌ దగ్గరకు వచ్చింది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. పూజ, ప్రకాష్‌పై చేయి చేసుకుంది. అతన్ని బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తోటి ఉద్యోగులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఇంత జరిగినా ‘నాకు పూజ కావాలి’ అనడంతో వాళ్ళ అక్క ప్రకాష్‌ను తీసుకుని ఐద్వా దగ్గరకు వచ్చింది.
మేము పూజకు ఫోన్‌ చేసి పిలిపిస్తే ‘నాకు పెండ్లి అయింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రకాష్‌కు ముందు ఆ విషయం తెలి యదు. తర్వాత అతనికి తెలిసింది. ఇప్పుడు అతనితో నేను ఉండలేను. నాకు నా భర్త అంటే ప్రాణం. నేను అతన్ని వదిలిపెట్టి ఇతనితో ఎలా ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భవిష్యత్‌లో నేను నా పిల్లలకు ఏం చెప్పాలి. నువ్వే కావాలి. నువ్వే కావాలి’ అంటూ వేధిస్తున్నాడు. నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అందుకే కొట్టాను’ అంది.
ప్రకాష్‌ కంటే నీకు పెండ్లయిందని తెలియదు, నీకు తెలుసు కదా? మరి అలాంటప్పుడు నీవు ఎందుకు అతని తో ఇంత దూరం వచ్చావు? నాకు పెండ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నపుడు దూరంగా ఉన్నాడు కదా! ఎందుకు నీవు మళ్ళీ అతని జీవితంలోకి వచ్చావు’ అడిగాము. ‘నా భర్త వల్ల నేను ప్రకాష్‌కు దగ్గరయ్యాను. అతను నన్ను హింసించే వాడు. బాగా తాగి వచ్చి కొట్టేవాడు. అలాంటి సమయంలో ప్రకాష్‌తో పరిచయం జీవితంపై ఆశలు పెంచింది. కానీ ఇలాంటి సంబంధానికి సమాజం ఒప్పుకోదు. నేను నా భర్తకు విడాకులు ఇవ్వడానికి మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. నేను ఆయనకు విడాకులు ఇచ్చినా ప్రకాష్‌ కుటుంబం నన్ను ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా భర్త దగ్గర ఉంటేనే నాకూ నా పిల్లలకు గౌరవం’ అంది.
ఎంత చెప్పినా ప్రకాష్‌ మాత్రం ‘పూజ భర్తతో ఉంటే అతను ఆమెను బాగా చూసుకోడు. తన పిల్లలను కూడా నేను చూసుకుంటాను. ఆమె వాడితో కష్టాలు పడటం ఎందుకు? నాతో ఉంటే ఏ కష్టం లేకుండా హాయిగా చూసుకుం టాను. అతనిలో మార్పు వచ్చేది ఉంటే ఇదివరకే వచ్చేది కానీ రాలేదు. తనని నాతోనే ఉండమని చెప్పండి’ అన్నాడు.
దాంతో మేము ప్రకాష్‌తో ‘నీకు పూజపై ఉన్నది ప్రేమ కాదు, జాలి మాత్రమే. జాలితో జీవితాలు గడపడం చాలా కష్టం. జాలి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. దాన్నే నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. ఇవన్నీ ఇంతటితో ఆపేసెరు. లేదంటే పెండ్లయి ఇద్దరు పిల్లలున్న అమ్మాయిని వేధిస్తున్నావని నీపై కేసు అవుతుంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇద్దరూ ఎవరికీ తెలియకుండా గుడి దగ్గర దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెండ్లి కాదు. నువ్వు నిజంగా పూజను ప్రేమిస్తే ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరు కోవాలి. అంతేకాని బలవంతంగా నీతో ఉంచుకోవడం సరైంది కాదు. కాబట్టి ఆమెను మరిచి పోయి కొత్త జీవితం ప్రారంభించు’ అని చెప్పి పంపించారు.

– వై. వరలక్ష్మి, 9948794051