నేడు అల్పపీడనం

– అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం
– పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ
– వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఎక్కువ ప్రదేశాల్లో, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. సోమవారం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దగ్గర్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 25, 26 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని సూచించారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగా లులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐద్రోజు లకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. 25న మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో, 27న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఆ జిల్లాల కు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో అత్యధికంగా 5.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 60 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.