మద్యం దుకాణాలకు లక్కీడ్రా

 Lucky draw for liquor stores– పలు జిల్లాల్లో ప్రారంభించిన కలెక్టర్లు
– ప్రశాంతంగా ముగిసిన లాటరీ
– జగిత్యాల జిల్లాలో అంతరాయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌/విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. 2023-25 ఏడాదికిగాను 2620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన అర్హులను ఎంపిక చేశారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలో మినహాయిస్తే అన్ని జిల్లాల్లో ప్రశాంతంగానే ముగిసిందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపికైనవారు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్‌ రుసుంలో ఆరో వంతు చెల్లించాలి. డిసెంబర్‌ ఒకటో తేది నుంచి కొత్త దుకాణాల్లో అమ్మకాలకు అనుమతిస్తారు. రాష్ట్రంలోని 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, సరూర్‌నగర్‌, శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాల్లోనే 42,596 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ గతంలో 18,091 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా సరూర్‌నగర్‌లో
134 మద్యం దుకాణాలకుగాను 10,908 దరఖాస్తులు, శంషాబాద్‌లో 100 షాపులకు 10,811 దర ఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నల్లగొండలో 155 దుకాణాలకు 7,058, ఖమ్మంలో 122 షాపులకు 7,0 27, మేడ్చల్‌లో 114 దుకాణాలకు 7,017, మల్కాజిగిరిలో 6,722, కొత్తగూడెంలో 5,057 అప్లికేషన్లు వచ్చాయి.
లాటరీ ప్రక్రియ
హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను సోమవారం అంబర్‌పేట ఛే నంబర్‌లోని మహారాణా ప్రతాప్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జిల్లాకు సంబంధించి 179 మద్యం దుకాణాలకు 7,138 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌ యూనిట్‌ పరిధిలో మొత్తం 80 షాపులకు 3,628 దరఖాస్తులు వచ్చాయి. 80 షాపుల్లో ఎస్టీలకు-ఒకటి, ఎస్సీలకు-4, గౌడ్‌లకు-5 షాపులు కేటాయించారు. ఇక సికింద్రాబాద్‌ యూనిట్‌ పరిధిలో మొత్తం 99 మద్యం షాపులకు 3510 దరఖాస్తులు వచ్చాయి. 99 షాపుల్లో ఎస్సీలకు-7, ఎస్టీలకు ఒకటి, గౌడ్‌లకు-6 దుకాణాలు కేటాయించారు. సికింద్రాబాద్‌ యూనిట్‌ డ్రా పరిశ్రమల శాఖ సంచాలకులు కృష్ణ అదిత్య పర్యవేక్షణలో నిర్వహించగా.. హైదరాబాద్‌ యూనిట్‌ లక్కీ డ్రా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి నేతృత్వంలో నిర్వహించారు. ఈ లాటరీ ప్రశాంతంగా జరిగింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌ యూనిట్‌లో 114 దుకాణాలు మల్కాజిగిరిలో 88 దుకాణాలు ఉన్నాయి. మేడ్చల్‌ యూనిట్‌లో 7519, మల్కాజిగిరి ఎక్సైజ్‌ యూనిట్‌లో 6722 దరఖాస్తులు వచ్చాయి. రెండు యూనిట్లలో కలిపి 14,241 దరఖాస్తులు వచ్చాయి. నాగోల్‌ డివిజన్‌లోని అనంతుల రామ్‌రెడ్డి గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అమరు కుమార్‌, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ భారతి హౌలీ కేరి లు పాల్గొని లక్కీ డ్రా ద్వారా దుకాణ దారులను ఎంపిక చేశారు.రంగారెడ్డిజిల్లాకు సంబంధించిన లాటరీ శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో సోమవారం అధికారులు నిర్వహించారు. ఈ వేలం పాటలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ పాల్గొన్నారు. శంషాబాద్‌ జోన్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో 100 వైన్‌ షాపులకు, సరూర్‌నగర్‌ పరిధిలో 134 వైన్‌ షాపులకు వేలంపాట నిర్వహించారు. కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతిని అనుసరించి కేటాయించారు. 50 నుంచి 170 వరకు ఒక్కో వైన్‌ షాప్‌కు వేలంపాటలో పోటీదారులు పాల్గొన్నారు. వేలాదిమంది వేలంపాటలో పాల్గొనడానికి రావడంతో నేషనల్‌ హైవే ప్రధాన రహదారితో పాటు మల్లికా కన్వెన్షన్‌ సింప్లెక్స్‌ ఏరియా కార్లతో నిండిపోయింది.
అయిదు చోట్ల వాయిదా..
దరఖాస్తులు తక్కువ వచ్చాయన్న కారణంతో అయిదు చోట్ల లాటరీలను వాయిదావేసినట్టు అధికారులు తెలిపారు. భూపాలపల్లి (3), కామారెడ్డి (1), ఆసిఫాబాద్‌ (5), నిర్మల్‌ (4), ఆదిలాబాద్‌ (9)లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్చించుకొని తర్వాత లాటరీ తీస్తారని తెలిపింది.