సత్తుపల్లి అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థిగా మాచర్ల భారతి

నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా మాచర్ల భారతి పోటీ చేయనున్నారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించిన 14 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో మాచర్ల భారతి పేరు సత్తుపల్లికి ఖరారు చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతినే పోటీచేసిన విషయం విధితమే.
స్ఫూర్తినిచ్చిన నాయకులు : పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్‌రావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, బృందా కారత్‌, మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం, కొండపల్లి దుర్గాదేవి, ఏలూరి లక్ష్మినారాయణ, పి. రాజారావు
పార్టీలో బాధ్యతలు : ఇల్లందు డివిజన్‌ పార్టీ సెక్రటేరియట్‌ సభ్యురాలు, ఐద్వా టౌన్‌ Ê డివిజన్‌ సెక్రటరీగా బాధ్యతలు, పార్టీ ఇల్లందు టౌన్‌ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. 2014 సంవత్సరం నుండి ఖమ్మం జిల్లా కేంద్రంలో వుంటూ ఐద్వా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఐద్వా జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఆఫీసు బేరర్స్‌ సభ్యురాలుగా, కేంద్ర కమిటి సభ్యురాలుగా, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యురాలుగా, ఖమ్మం జిల్లా పార్టీ సెక్రటేరియట్‌ సభ్యురాలుగా కొనసాగుతున్నారు.
ఉద్యమాలలో కీలకపాత్ర : 2000 సం.లో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2006లో జరిగిన ఇళ్ళ స్థలాలు, భూపోరాటంలో 5 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్షలో పాల్గొన్నారు. మహాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం నుండి ఖమ్మం వరకు సాగిన సాగునీటి సాధన మహా పాదయాత్రలో 13 రోజులపాటు, 300 కి.మీ.లు యాత్రలో పాల్గొన్నారు. సామాజిక న్యాయం – సమగ్రాభివృద్ధి కోసం జరిగిన మహాజన పాదయాత్రలో 15 రోజులపాటు పాల్గొన్నారు.
కేసులు – నిర్భంధాలు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల విడుదల కోసం చేసిన పోరాటంలో 4 రోజులు జైలు జీవితం గడిపారు. మద్య నిషేదం, రైతులకు గిట్టుబాటు ధరల కోసం జరిగిన రాష్ట్ర వ్యాప్త సరిహద్దు దిగ్బంధనం, మున్సిపల్‌ సమస్యలపై ఆందోళనలలో అక్రమ కేసులు బనాయించబడి నేటికీ కొనసాగుతున్నాయి.