ఔరంగజేబు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు

– ఓట్ల కోసమేనంటున్న విశ్లేషకులు
ముంబయి : గత నాలుగు నెలలుగా మహారాష్ట్ర రాజకీయాలు మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు చుట్టూ తిరుగుతున్నాయి. ఇదంతా మతపరమైన ఏకీకరణకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగమేనని రాజకీయ పండితులు అంటున్నారు. ఔరంగజేబు పాలనలో రాజధానిగా కొనసాగిన ఔరంగాబాద్‌ నగరం పేరును బీజేపీ-శివసేన ప్రభుత్వం ఫిబ్రవరిలో ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చేసింది. ఔరంగజేబును కీర్తిస్తే సహించబోమని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. ఓ మతానికి చెందిన యువకులు ఔరంగజేబు చిత్రాలను ప్రదర్శిస్తున్నారని అంటూ వారు ఔరంగజేబు వారసులని నిందించారు. అహ్మద్‌నగర్‌లో జరిగిన ప్రదర్శన సందర్భంగా ఔరంగజేబు చిత్రాలను ప్రదర్శించడాన్ని, కొల్హాపూర్‌లో కొందరు స్థానికులు సామాజిక మాధ్యమాలలో టిప్పు సుల్తాన్‌ ఫొటోను స్టేటస్‌లో పెట్టుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలో శాంతిని, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీ విమర్శించాయి. కాగా రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో హిందూ ఓట్లను దండుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు మొఘల్‌ చక్రవర్తి పేరును వాడుకుంటున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఒకటి రెండు ప్రాంతాలలో మినహా మహారాష్ట్రలో ఇలాంటి ప్రయత్నాలు గతంలో జరగలేదని హేమంత్‌ దేశారు అనే విశ్లేషకుడు చెప్పారు. హిందూ సంస్థలే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయనడంలో సందేహం లేదని అన్నారు. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదో ప్రయత్నమని ప్రొఫెసర్‌ శ్రద్ధ కుంభోజ్కర్‌ విమర్శించారు. ఛత్రపతి శివాజీ పట్ల ఔరంగజేబు వ్యవహరించిన తీరు ఆయన్ని మరాఠాల దృష్టిలో విలన్‌గా మార్చిందని చెప్పారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ గత సంవత్సరం ఔరంగజేబు సమాధిని సందర్శించారు. దీనిపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన మండిపడ్డాయి. మార్చి నెల నుండి సోషల్‌ మీడియాలో ఔరంగజేబును కీర్తిస్తూ పోస్టులు పెట్టిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా పదిహేనవ దశాబ్దం నాటి పాలకుడు అహ్మద్‌ నిజాం షా-1 పేరిట ఏర్పడిన అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును 18వ శతాబ్దం నాటి మాల్వా రాణి అహల్యాబాయి పేరిట అహల్యా నగర్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు.