జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
నీట్‌లో ప్రతిభ చాటిన రాఘవిని అభినందించిన జడ్పీటీసీ
నవతెలంగాణ-ఆమనగల్
కష్టపడి చదివి కన్న కలలను సాకారం చేసుకోవాలని జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని గానుగుమర్ల తాండాకు చెందిన నేనావత్ చిత్ర బిక్యా నాయక్ దంపతుల కూతురు రాఘవి ఇటీవల విడుదలైన ఆలిండియా నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని తన నివాసంలో రాఘవితో పాటు ఆమె తల్లిదండ్రులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ రాఘవిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అందరు చిన్న నాటి నుంచే కష్టపడి చదివి కని పేంచిన తల్లిదండ్రుల ఆశయాలను, విద్యా బుద్ధులు చెప్పిన గురువుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని సూచించారు. అదేవిధంగా ఇక ముందు కూడా కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి పుట్టి పెరిగిన ప్రాంతానికి గుర్తింపు తేవాలని రాఘవికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రియా రమేష్, సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్, యువ నాయకులు రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యువత స్వయం కృషితో ముందుకు సాగాలి
ఉన్నత విద్యను అభ్యసించిన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ సూచించారు. కడ్తాల్ మండలంలోని మక్తమాధారం గ్రామానికి చెందిన బిక్షపతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్రై క్లీనింగ్ షాప్‌ను శుక్రవారం ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, సులోచన సాయిలు, ఎంపీటీసీ సభ్యులు మంజుల చంద్రమౌళి, ఉపసర్పంచ్ గణేష్ తదితరులతో కలిసి జడ్పీటీసీ దశరథ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించి తోటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.