మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

– త్వరలోనే ప్రారంభానికి సన్నాహాలు
– 60వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
నవతెలంగాణ – కొనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ మంగళవారం సక్సెస్‌ అయింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో పనిచేశారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌజ్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం 7గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్‌ రన్‌ పనులను చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఎంఆర్‌కెఆర్‌ ఏజెన్సీల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ట్రయల్‌ రన్‌పై ఎప్పటికప్పుడూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ట్రయల్‌ రన్‌ సమన్వయ బాధ్యతలు చూసారు.రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ నిర్మాణంతో 60వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు 26,150ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో రైతాంగం సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. త్వరలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.