మంచిరేవుల భూములు ప్రభుత్వానికే చెందుతాయి

– ఈ భూములు విషయంలో కింది కోర్టు జోక్యం చేసుకోవడానికి లేదు : సుప్రీం కోర్టు తీర్పు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మంచిరేవుల్లో ఆక్రమణకు గురైన భూములు అన్నీ ప్రభుత్వానికే చెందుతాయని, గ్రేహౌండ్స్‌కు సంబంధించినవిగా అత్యన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. మంచిరేవుల వద్ద ఉన్న 143 ఎకరాల భూ వివాదానికి తెరదించుతూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 1993లో మంచిరేవులలో 143 ఎకరాల భూమిని ప్రయివేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. అసైన్డ్‌ భూములు ఆక్రమించుకోవడంపై ప్రయివేటు వ్యక్తులకు అప్పటి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ భూములు ప్రయివేటు వ్యక్తులకే చెందుతాయని అప్పటి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 2021లో డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం సవాలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను అనుమతించి… సింగిల్‌ జడ్జి తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పక్కన పెట్టేసింది. దీంతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ఆక్రమణ దారులు సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగగా.. ఆక్రమణ దారులు దాఖలు చేసిన పిటిషన్‌లు కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఇకపై ఈ భూములు విషయంలో క్రింది స్థాయి కోర్టులు, హైకోర్టులు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని తీర్పులో స్పష్టం చేసింది. ఇప్పుడు తాము ఇచ్చిన ఆదేశాలే ఫైనల్‌ అని, ఇకపై ఎలాంటి జోక్యాలు అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. పోలీసు విభాగంలోని గ్రేహౌండ్స్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని, అవి చట్టబద్ధమైనవని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది శ్రీహర్ష తుది వాదనలు వినిపించారు.