మాన్యువల్‌ స్కావెంజింగ్‌ను సమూలంగా నిర్మూలించాలి

Manual scavenging Must be eradicated– మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలి
–  శాశ్వత వైకల్యానికి గురైన వారికి రూ. 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి
–  కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చేతులతో మురుగును శుభ్రం చేసే కార్మికులు (మాన్యువల్‌ స్కావెంజర్స్‌) మృతి చెందితే వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ పరిహారం అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ అనేక మంది చనిపోతున్నారని, పలువురు వైకల్యానికి గురవుతున్నారంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌. రవీంద్రభట్‌, జస్టిస్‌ అర్వింద్‌ కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్‌ స్కావెంజింగ్‌ను సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
చేతులతో మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే మాన్యువల్‌ స్కావెంజర్‌గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన వారికి రూ. 20 లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచించింది. ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని తెలిపింది. ప్రమాద ఘటనలు జరగ కుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
”మనది సంపద లేదా అధికారం కోసం కాదు. ఇది స్వేచ్ఛ కోసం పోరాటం. స్వాతంత్య్రం కోసం పోరాటం. మానవ వ్యక్తిత్వ పునరుద్ధరణ కోసం యుద్ధం. రాజ్యాంగంలో నిజమైన సౌభ్రాతృత్వాన్ని, గౌరవం పోషించే ప్రాథమిక పాత్రను గుర్తించడం పౌరులందరిపై ఉన్న కర్తవ్యాన్ని ఇది పునరుద్ధరి స్తుంది” అని బీఆర్‌ అంబేద్కర్‌ను ఉటంకిస్తూ ధర్మా సనం తీర్పును జస్టిస్‌ భట్‌ చదివి వినిపిం చారు. ఈ విలువలు లేకుండా, ఇతర స్వేచ్ఛలు కేవలం భ్రమ లు అని ధర్మాసనం గుర్తించింది. రాజ్యాంగం గౌర వం, సౌభ్రాతృత్వానికి గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. తరతరాలుగా వేధిస్తున్న అంధకారాన్ని పారద్రోలేం దుకు, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను, వివిధ రకాల న్యాయాలను ఆస్వాదించేలా కృషి చేయాలని జస్టిస్‌ భట్‌ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. ఈ విషయం లో పురోగతిని పర్యవేక్షించడం కోసం విచారణను 2024 ఫిబ్రవరి 1న షెడ్యూల్‌ చేశామన్నారు. మాన్యువల్‌ స్కావెంజింగ్‌ను పూర్తిగా నిర్మూలించాల న్నారు. ఈ దయనీయ పరిస్థితుల వల్ల ప్రభావిత మైన వారికి సమగ్ర పునరావాసం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
మురుగు కాలువలను మాన్యువల్‌గా శుభ్రపరిచే సమయంలో పెరుగుతున్న మరణాల సంఖ్యపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక మాన్యువల్‌ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం, వారి పునరావాస చట్టం 2013ని సమర్థ వంతంగా అమలు చేయడంపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. పౌరులందరికీ సమాన హక్కుల గురించి రాజ్యాంగం వాగ్దానాన్ని నెరవేర్చే ప్రాము ఖ్యతను నొక్కి చెప్పింది.
గత ఐదేండ్లలో మురుగు కాలువలను శుభ్రం చేస్తూ దాదాపు 350 మంది పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. 2022లో లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించిన డేటా ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో 40 శాతం మరణాలు సంభవించాయి.
2013, 2018లో నిర్వహించిన సర్వేల ప్రకారం దేశంలో 58,098 మంది మురుగు కాలువలను శుభ్రం చేసే వృత్తిలో కొనసాగుతు న్నారని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. మాన్యువల్‌ స్కావెంజింగ్‌పై నిషేధం ఉంది. ఆ వృతిలో కొనసాగుతున్న వారికి పునరావాసం కల్పించాలని చట్టం కూడా చేశారు. కుల ఆధారిత వృత్తిపై 1993లోనే నిషేధం విధించినప్పటికీ అది ఇప్పటికీ కొనసాగుతోందని కొందరు సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు.