ఎంబీసీలకు లక్ష అందని ద్రాక్షేనా?

– దరఖాస్తులకు దూరంగా లక్షల మంది..
– ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలజారీకి కొర్రీలు
– స్థిరనివాసం లేనివారిని పట్టించుకోని అధికారులు
– 5,28,862 లక్షల దరఖాస్తుల్లో ఎంబీసీలవి 12వేలే..
ప్రభుత్వం ప్రకటించిన లక్ష సాయం అత్యంత వెనుకబడిన కుల వృత్తుల (ఎంబీసీ) దరిచేరేనా? అంటే ఏమో..చెప్పలేం అంటూ సమాధానాలొస్తున్నాయి. కులవత్తుల వారికి సర్కారు ప్రకటించిన రూ.లక్ష సాయం పథకం.. అర్హులందరికీ అందే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిర్ణీత సమయానికి దరఖాస్తు చేసుకుందామంటే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు రాకపాయే.. గడువు పొడిగించాలని సర్కారును వేడుకున్నా..పట్టించుకోకపాయే..ఇప్పుడు ఎలా? అని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వం ప్రకటించిన లక్ష సాయంకు విధించిన గడువు చివరి తేదీ నాటికి 5,28,862 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో బీసీ ఏ 2,66,001, బీసీ బి1,85,136,బీసీ డి 65,310, కాగా,ఎంబీసీలవి 12,415 ఉన్నాయి. వృత్తి ఆధారిత జీవనంపై బతుకుతున్న 14 కుల వృత్తులతో పాటు, ఎంబీసీలలోని 36కులాలకు ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది.
ధృవపత్రాలకు కొర్రీ..
‘సంచారమే మా బతుకాయే.. ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు ఎక్కడవి’? ఇది ఎంబీసీల ఆవేదన. అడ్రస్‌ లేనోళ్లు.. అడుక్కునేటోళ్లు.. మీకు ధృవ పత్రాలు ఇవ్వాలంటే..ఎట్లా..? కష్టమే అంటూ ప్రభుత్వ అధికారులు కొర్రీలు పెట్టారు. మరో పక్క సర్వర్‌ డౌన్‌ సమస్యలతోపాటు, సిబ్బంది కొరత, ఆ సమయంలో దశాబ్ది ఉత్సవాల హడావిడి.. ఇత్యాది సమస్యలతో ఆ పత్రాలు చేతికి అందలేదు. దీంతో 12వేల మంది ఎంబీసీలు మాత్రమే దరఖాస్తు చేసుకోగలిగారు. సకాలంలో పత్రాలు అందక లక్షలాధి మంది పథకానికి దూరమయ్యారు. దరఖాస్తులకు గడువు పెంచాలని ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు సర్కారుకు మోర పెట్టుకున్నా..పెడచెవిన పెట్టింది. ఎంబీసీలే కాదు, అర్హత ఉన్నా సమయం లేక లక్షల మంది పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయారు. బీసీ జనాభాలో 38శాతం ఎంబీసీలుంటారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ వీరి దరి చేరటం లేదు. దీంతో రూ.లక్ష సాయం పథకాన్నైనా సద్వినియోగం చేసుకుందామని ఆశించినా..అది కూడా అందని ద్రాక్షలా మారుతుందా? అన్న అనుమానాలను లబ్దిదారులు వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కల్పించటంలో సర్కార్‌ వైఫల్యం..
పథకం లబ్దిదారులకు తగిన అవగాహన కల్పించటంలో సర్కార్‌ వైఫల్యం ఉన్నది. ఇందుకు ఆశావాహులు చేసుకున్న దరఖాస్తులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అత్యంత వెనుకబడిన వృత్తి కులాలవారు తక్కువ దరఖాస్తులు చేసుకున్నారు. ఎవరికైతే ఈ పథకం ఫలాలు అందాల్నో వారి నుంచే తక్కువ దరఖాస్తులు రావటం విచారకరమే. తరతరా లుగా సేవా,యాచక, సంచార జీవనాన్ని నమ్ముకుని బతుకుతున్న కుల వృత్తుల వారికి ప్రభుత్వ లక్ష్యం చేరువైతే..వారి బతుక్కు ఉపశమనాన్ని కల్పించినట్ట వుతుంది. కానీ..వడ్డెర 52వేలు, కుమ్మరి 47వేలు, నాయీబ్రాహ్మాణ 44వేలు,వడ్రంగి 40వేలు, పద్మ శాలి 23 వేలు, కమ్మరి 16వేలు,స్వర్ణకారులు 14 వేలు, రజక 1.13వేల గడువు సమయానికి దరఖా స్తులు చేసుకున్నారు. ఎంబీసీల పరిస్థితి చెప్పన వసరం లేదు. నేటికీ వారికి ప్రభుత్వం ఒక పథకం ప్రకటించిందన్న సంగతే తెలియకుండా ఉన్నారు.
పరిశీలనపై స్పష్టత ఇవ్వని సర్కార్‌..
వచ్చిన దరఖాస్తుల పరిశీలన సమయంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పరోక్ష జోక్యం పెరుగుతున్నదని విమర్శలు వస్తున్నాయి. తమ పార్టీ అనుయాయులకే ఈ పథకం ప్రయోజనం దక్కితే..దరఖాస్తు చేసుకున్నా..అందరికీ అందకపోతే ఎలా? అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఇన్‌చార్జి మంత్రి సంతకంతో లబ్దిదారులకు లక్ష సాయాన్ని అందించాలనే నిబంధన తిరిగి బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాలకే అన్న విమర్శలు లేకపోలేదు. మరో పక్క ఏ ఏ క్యాటగిరిల్లో ఎవరెవ రికి మొదటి విడతలో రూ.లక్ష సాయమందు తుందనేది స్పష్టత లేదు. దీంతో ఆశావాహులు ఆం దోళన చెందుతున్నారు. జూన్‌ ఆరున వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో 5లో నాయీబ్రాహ్మణ, రజకులు, సగర ఉప్పర, కుమ్మరి శాలివాహన, అవుసలి, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్డ/వడ్రంగి/ శిల్పులు, కృష్ణబలిజ,మేదరి, వడ్డెర, ఆరెకటిక, మేర తదితర 15 కులాలతోపాటు ఎంబీసీ 36 కులాలు ఈ జాబితాలో ఉన్నాయి.
నిరంతర ప్రక్రియపై సందేహాలు..
ఈ పథకానికి కాలపరిమితి లేకుండా నిరంతర ప్రక్రియ అంటూ అసంబద్ధంగా ప్రభుత్వం ప్రకటించటంలో సహేతుకత లేదని వృత్తి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో వెనుకబడ్డ కులాల జనాభా ఎంత? వారిలో వృత్తి కులాల వారు ఎంత మంది? ఇందులో సేవా, సంచార కుల వృత్తుల వారి సంఖ్య ఎంత? వీరందరికీ ఎప్పటి వరకు రూ. లక్ష సాయం పథకం లక్ష్యాన్ని చేరుకోగలమనే ప్రణాళికను ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. దీనికి తగిన బడ్జెట్‌ కేటాయింపులు చూపించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియను ప్రారంభించటం మూలంగా గతంలో ప్రకటించిన మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలలాగానే ఇది కూడా నత్తను మరిపించేలా సాగుతుందా? అని లబ్దిదారులు అనుమానిస్తున్నారు.