రోగుల రద్దీకి తగ్గట్టు వైద్య సిబ్బంది

– పీహెచ్‌సీల్లో సిబ్బంది హేతుబద్ధీకరణ
– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని హేతుబద్ధీకరించనున్నారు. ఇందుకోసం గతంలో వేసిన కమిటీ చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ వైద్యారోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో హేతుబద్దీకరణ ప్రక్రియకు పచ్చెజెండా ఊపింది. రోగుల రద్దీకి తగ్గట్టు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలను విడుదల చేశారు.
కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఒక్క డీఎంహెచ్‌ఓ మాత్రమే ఉన్నారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ జోన్ల వారీగా చార్మినార్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌లకు ఐదు డీఎంహెచ్‌ఓ పోస్టులకు మంజూరునిచ్చింది.
వీటితో కలుపుకుని రాష్ట్రంలో 38 మంది డీఎంహెచ్‌ఓలు సేవలందించనున్నారు. రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా లేవనీ, వాటిని పునర్‌ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. 40 కొత్త మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసింది.
ఇప్పటికే 30 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మండలాల్లో ఔట్‌రీచ్‌ కార్యకలాపాలను కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లచే నిర్వహిస్తున్నారు. సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడంతో ఔట్‌ రీచ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. దీంతో ఆ 30 మండలాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు అనుమతించింది.
రాష్ట్రంలోని 235 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)లను బలోపేతం చేయడానికి తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల సేవలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల పరిధిలోకి తెచ్చారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆస్పత్రిని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి మార్చారు. దీంతో 1,712 పోస్టులు సూపర్‌ న్యూమరీ పోస్టులుగా మారాయి. మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మహిళ) కేడర్‌ ఈ హేతుబద్ధీకరణలో కవర్‌ చేయలేదు. దీంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థల్లో మంజూరు చేయబడిన ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) పోస్టుల స్థానం మారదు. ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల రద్దీకి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్టు స్పష్టం చేసింది.