నూరున్నిస్సా.. అయేషా బాను… పుట్టుకతోనే కంటిచూపు కోల్పోయారు. కానీ ఏదో చేయాలనే తపన. అందుకే ఇద్దరూ డిస్కవరింగ్ హ్యాండ్స్‌లో భాగంగా ఎనేబుల్ ఇండియా ద్వారా శిక్షణ పొంది మెడికల్ ట్యాక్టైల్ ఎగ్జామినర్‌లుగా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జర్మనీలో డాక్టర్ ఫ్రాంక్ హాఫ్‌మన్ ప్రారంభించారు. ప్రారంభదశలోనే రొమ్ము క్యాన్సర్ కణితులను గుర్తిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు.
నూరున్నిస్సాకు డాక్టర్ కావాలని కోరిక. కానీ అది ఆమెకు సాధ్యం కాదని తెలుసు. ఎందుకంటే పుట్టుకతోనే ఆమె అంధురాలు. దాంతో నూర్ బెంగళూరులోని జ్యోతి నివాస్ కళాశాల నుండి చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రంలో బీఏ చదివారు. అంతటితో ఆగిపోక తన విద్యను మరింత కొనసాగించింది. ఇప్పుడు వేలాది మంది మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నూర్ ఒక మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ (మీజు), డిస్కవరింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం కోసం మహిళలను పరీక్షించడానికి ఇస్తున్న శిక్షణ ఇది. అందులో ఆమె కూడా శిక్షణ పొందారు.
మొదటి బ్యాచ్‌లో…
‘నేను ఇటీవల కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతంలో వైద్య శిబిరంలో భాగంగా మహిళలను పరీక్షించాను. వాళ్లు నన్ను ‘డాక్టర్’ అని పిలవడం మొదలుపెట్టారు. చాలా సంతోషంగా అనిపించింది’ అని నూర్ చెప్పారు. భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోంది. నూర్, అయేషా బాను ఇద్దరూ స్నేహితులు. అంధులు కాబట్టి వీరు వైద్య విద్య చేసే అవకాశమే లేదు. కానీ ఇప్పుడు వారు ఎంతో మంది మహిళల ప్రాణాలను కాపాడుతున్నాడు. రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడంలో సహాయపడుతున్నారు. బెంగళూరులోని ఎన్‌ఏబుల్ ఇండియా ఆధ్వర్యంలో డిస్కవరింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్‌లో వీరు ఉన్నారు.
ప్రత్యేక స్పర్శ ద్వారా…
జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ హాఫ్‌మాన్ ఆలోచనే ఈ ట్రైనింగ్. అంధులైన మహిళలకు పరికరాలు, గాడ్జెట్‌లు, యంత్రాలను ఉపయోగించకుండా మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్‌లుగా (మీజు) శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతి ద్వారా మీజులు వారి ప్రత్యేక స్పర్శ నైపుణ్యాల నుండి 0.3 మిమీ కంటే తక్కువ రొమ్ము క్యాన్సర్ కణితిని ప్రారంభ దశలోనే గుర్తించగలరు. డిస్కవరింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్‌ను భారతదేశంలో నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, ఢిల్లీ ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికే నాలుగు బ్యాచ్‌ల మీజు లకు శిక్షణనిచ్చింది. ఎనేబుల్ ఇండియా నుండి నూర్, ఆయేషా బెంగళూరులోని సైట్‌కేర్ క్యాన్సర్ హాస్పిటల్‌లో మీజులుగా పని చేస్తున్నారు. అయితే ఐదుగురు మహిళలతో కూడిన రెండవ బ్యాచ్ ప్రస్తుతం నగరంలోని సైట్‌కేర్, అపోలో హాస్పిటల్‌లో ఇంటర్‌నింగ్‌లో ఉన్నారు.
ప్రారంభ సంకేతాల కోసం స్క్రీనింగ్…
ఆయేషా, నూర్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే బెంగళూరులోని జ్యోతి సేవా రెసిడెన్షియల్ ఫర్ ది బ్లైండ్ స్కూల్‌లో చేరారు. అండర్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తయిన తర్వాత మిత్ర జ్యోతి నుండి కంప్యూటర్ కోర్సు చేసారు. కోర్సు సమయంలో ఎనేబుల్ ఇండియా ద్వారా మీజు కోర్సు గురించి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసుకుని 2019 చివరిలో శిక్షణ ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా వారు 2022 చివరి నాటికి కోర్సును పూర్తి చేయగలిగారు. తర్వాత సైట్‌కేర్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌లుగా చేరారు. అక్కడ సిబ్బందిపై స్క్రీనింగ్ ప్రాక్టీస్ చేశారు. ఓటీకి వైద్యులతో పాటు వెళ్లారు. క్యాన్సర్ గడ్డల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు. వారిద్దరూ ఇప్పుడు ఆసుపత్రిలో పూర్తి సమయం పనిచేస్తున్నారు.
పరీక్ష చేసే విధానం…
‘మొదట మేము రోగి కుటుంబ చరిత్ర, గత శస్త్రచికిత్సలు, వైద్య చరిత్ర గురించి తెలుసుకుంటాం. కంప్యూటర్ లలో వారి వివరాలన్నీ పూరించి పరీక్ష ఎలా జరుగుతుందో వివరిస్తాం. సందేహాలు ఏవైనా ఉంటే అడగమంటాం. పరీక్ష గదిలో రోగి తనపై వస్త్రాన్ని తీసివేసిన తర్వాత కూర్చోబెడతాం. ఆమె రొమ్ములపై చర్మ మార్పులు, మెడ, కాలర్ ఎముకలపై పరీక్షిస్తాం. రొమ్ము ఆకతి, రొమ్ము చర్మ ఉష్ణోగ్రత సమరూపతను తనిఖీ చేస్తాం. తర్వాత రోగిని మంచం మీద పడుకోబెట్టి రొమ్ముపై ణూజూ అని పిలువబడే ఐదు స్పర్శ బ్రెయిలీ టేపులను పెడతాం. రొమ్ము, దాని చుట్టుపక్కల ఉన్న ఛాతీ ప్రాంతం రెండిరటిలోనూ పాల్పేటరీ పరీక్షను నిర్వహిస్తాం. దీని కోసం మేము రెండు వేళ్లను (చూపుడు, మధ్య వేలు) ఉపయోగిస్తాం’ అంటూ ఆయేషా పంచుకున్నారు.
బంధం పెంచుకుంటాము…
ఈ పరీక్ష మీజుకి కణితులు, దాని పరిమాణం, ఆకతిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. పరీక్షలు పూర్తయిన తర్వాత రిపోర్టులు డాక్టర్‌కు పంపుతాము. అవసరమైతే రోగనిర్ధారణ పరీక్షకు పంపిస్తారు. 35-40 నిమిషాల పాటు ఉండే స్క్రీనింగ్ పూర్తయ్యే వరకు రోగి రిలాక్స్‌గా, సౌకర్యవంతంగా ఉండేలా మీజు చూస్తుందని నూర్ చెప్పారు. ‘సౌకర్యంగా ఉందా అని మేము వారిని అడుగుతూనే ఉంటాము. ఈ ప్రక్రియలో వారు భయాందోళనలకు గురికాకుండా మాటలతో వారితో బంధం పెంచుకుంటాము. మాకు కండ్లు లేవు కాబట్టి బట్టలు లేని వారిని మేము చూడలేము. దాంతో వారు స్క్రీనింగ్ టెస్టును మరింత సౌకర్యవంతంగా చేయించుకుంటారు’ అని ఆయేషా జత చేశారు.
సకాలంలో చికిత్స…
‘భారతదేశంలో మనం మూడు, నాలుగు దశల్లో ఉన్న రొమ్ము క్యాన్సర్స్ రోగులను చూస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు అవకాశం ఉన్నా స్క్రీనింగ్‌కి వెళ్ళడానికి ఇప్పటికీ వెనుకాడతారు. అలాంటి వారికి వీరు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే చాలా మంది వైద్యులు స్క్రీనింగ్ క్యాంపులకు హాజరవుతున్నారు. ఇవి మంచి ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ అమ్మాయిలకు కూడా ఉద్యోగం దొరుకుతుంది. అలాగే క్యాన్సర్‌ను ముందే గుర్తించడం వల్ల సకాలంలో చికిత్స అందుతుంది. రోగి జీవించే అవకాశాలను పెంచుతుంది’ అని డాక్టర్ జయంతి అంటున్నారు.
మార్పును తీసుకొస్తుంది
నూర్, అయేషా స్క్రీనింగ్ క్యాంపులలో పాల్గొనడానికి కర్ణాటకలోని హౌస్కోటే, మదనపల్లికి వెళ్లారు. ‘అవగాహన కల్పించడం ద్వారా రొమ్ములో ఏద్కెనా అసాధారణత ఉన్న మహిళలను త్వరగా ఆసుపత్రికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఇది చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది’ అని డాక్టర్ పూవమ్మ అంటున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం గురించి ఇతరులకు అవగాహన పెంచే వత్తిలో భాగంగా ఉన్నందుకు అమ్మాయిలు చాలా సంతోషంగా వున్నారు.
-పరిస్థితులను తట్టుకునేలా
MTE కావడం వల్ల నా భావోద్వే గాలను నేను నియంత్రించుకోగలుగుతు న్నాను. సవాళ్లను ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం నాకు వచ్చింది’ అని నూర్ చెప్పారు. ‘వైద్య శిబిరాల ప్రయాణం నన్ను వివిధ రకాల పరిస్థితులను తట్టుకునేలా చేస్తుంది, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’అని అయేషా చెప్పారు.
MTE గా మారే దిశగా ప్రయాణం…
ఎనేబుల్ ఇండియా సీనియర్ మేనేజర్ రితుపర్ణ సారంగి మాట్లాడుతూ దష్టిలోపం ఉన్నవారికి వారి దైనందిన జీవితంలో, విద్యలో లేదా జీవనోపాధిలో అవసరమైన సహాయం చేయడం ఎన్‌జీఓ లక్ష్యం’ అన్నారు. డిస్కవరీ హ్యాండ్స్ ప్రోగ్రాం ట్రైనర్ అశ్విని రావు మాట్లాడుతూ ‘ఇది తొమ్మిది నెలల శిక్షణా కార్యక్రమం. ఆరు నెలల తర్వాత వారు థియరీ పరీక్షకు హాజరు కావాలి. తర్వాత మూడు నెలల పాటు గైనకాలజిస్ట్ లేదా బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ కింద పని చేయాలి. ఇంటర్న్‌షిప్ తర్వాత డాక్టర్ హాఫ్‌మన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న వారి ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలి. మానవ శరీర నిర్మాణ శాస్త్రం, స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ గురించి కూడా మేము బోధిస్తాం. అంధులైన మహిళలకు కంప్యూటర్, ఉపాధి, జీవన నైపుణ్యాలు, కౌన్సెలింగ్ అందించడానికి ఎనేబుల్ ఇండియా శిక్షణా కాలానికి మరో మూడు నెలలు చేర్చాం’ అన్నారు.
– సలీవ