విలీనం సరే… సీసీఎస్‌ డబ్బు సంగతేంది?

కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆసియా ఖండంలోనే ప్రతిష్టాత్మక కో-ఆపరేటివ్‌ సొసైటీలలో రెండవ స్ధానంలో ఉన్న సంస్థ టీఎస్‌ఆర్‌టీసీ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) దేశదేశాల నుండి అనేక సంస్థలు అధ్యయనం కోసం సందర్శించిన సంస్థ. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థ నేడు తన వాటాదారులకు ఒక్క రూపాయి కూడా లోన్‌ ఇవ్వలేని స్థితికి ఎందుకు వచ్చింది? సీసీఎస్‌ డిపాజిట్‌ చేసుకున్న దానిపై వచ్చే వడ్డీ డబ్బులతో జీవనం గడుపుతున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు వడ్డీ చెల్లించలేని స్థితి ఎందుకు వచ్చింది? కూతురు పెండ్లి, పిల్లల చదువులకు ప్రయివేటు వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు? మాతృసంస్థ ఆర్‌టీసీ నుండి రిటైరైన/ వీఆర్‌ఎస్‌ తీసుకున్న వారికి చెల్లించాల్సిన డబ్బులు కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణమెవరు? ప్రయివేటు అప్పుల నుండి రక్షించుకోవడం, అవసరమైన సమయంలో తేలికగా రుణం పొంద డం కోసం 05 ఏప్రిల్‌ 1952లో ఏర్పాటు చేసుకున్నదే ఈ సీసీఎస్‌ సంస్థ. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్‌ఆర్‌టీసీ సీసీఎస్‌గా పని చేస్తున్నది. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాతృసంస్థ ఆర్టీసి యాజమాన్యం కార్మికుల బేసిక్‌ పే నుండి ఏడు శాతం మూలధనం వాటా, కార్మికులు తీసుకున్న లోన్‌ల నెలవారీ రికవరీలను జీతం నుంచి స్వాధీనం చేసుకుని 15 రోజుల లోపు సీసీఎస్‌కు జమ చేస్తారు. సీసీఎస్‌ నిర్వహణ అనేది పూర్తిగా కార్మికుల ఆధ్వ ర్యంలో ఎన్నికైన మేనేజింగ్‌ కమిటీ. దీన్ని కార్యదర్శి ద్వారా నిర్వహణ చేస్తారు. ఇది లాభాపేక్షతో కాకుండా కార్మికులకు ఇచ్చే అప్పుపై తీసుకుంటున్న వడ్డీకి, డిపాజిట్‌లపై వచ్చే వడ్డీకి మధ్య ఉండే ఒక శాతం వడ్డీతోనే నడుస్తున్నది.
సీసీఎస్‌ డబ్బును వాడుకున్న ఆర్‌టీసీ
ఆర్‌టీసీ యాజమాన్యం చేసిన రికవరీలను 60రోజుల లోపు చెల్లించవచ్చని, 60 రోజులు దాటిన పీరియడ్‌కు వడ్డీతో చెల్లించాలని 2012లో సీసీఎస్‌ మేనేజింగ్‌ కమిటీతో ఒక అవగాహన కుదిరింది. గత కొన్నేండ్లుగా ఆర్‌టీసీ యాజమాన్యం ఆర్‌టీసీకి చెల్లించాల్సిన డబ్బులను తన స్వంతం కోసం వాడుకోవడం ప్రారంభించి, సీసీఎస్‌కు మాత్రం చిల్లర విదిల్చడం ప్రారంభించింది. దాంతో సీసీఎస్‌కు ఆర్‌టీసీ సంస్థ చెల్లించాల్సిన అసలు, వడ్డీ డబ్బులను చెల్లించకుండా ఇబ్బంది పెడ్తూ వస్తున్నది. ఆర్‌టిసి సంస్థ తమకు డబ్బులు చెల్లించాలని 2019లో కూడా కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఒక్కసారిగా ఇవ్వకుండా ఇన్‌స్టాల్‌ మెంట్స్‌గా ఇచ్చారు. మరి ఆ తర్వాతనైనా తమ తప్పు తెలుసుకొని, కార్మిక కుటుంబాల ప్రయోజనాల దృష్టితోనైనా సీసీఎస్‌ కోసం రికవరీ చేసిన డబ్బులను సీసీఎస్‌కు చెల్లించాల్సిన ఆర్‌టీసి సంస్థ, ఆ పని చేయకుండా నిస్సిగ్గుగా వ్యవహ రించింది. ఈ పరిస్థితి వల్ల సీసీఎస్‌కు ఆర్‌టీసీ సంస్థ ఇవ్వాల్సిన డబ్బులు రూ.670 కోట్లు కాగా, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన వడ్డీ సుమారు రూ.400 కోట్లు, వెరసి మొత్తం రూ.1070 కోట్లు ఆర్‌టీసీ వాడుకొని, సీసీఎస్‌ను దివాళా వైపునకు నెటింటి. ఆర్టీసీ తప్పుకు 45వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడటమేగాక తీవ్ర అభద్రతకు లోనవుతున్నారు.ఈ స్థితిలోనే సీసీఎస్‌ మేనేజింగ్‌ కమిటీ మరోసారి రాష్ట్ర హైకోర్టు మెట్టెక్కింది. దీనిపైన 25 నవంబర్‌ 2022న మధ్యంతర ఉత్తర్వులనిస్తూ, ఉత్తర్వులు ఇచ్చిన రోజు నుండి నాలుగు వారాలలోపు రూ.100 కోట్లు ఇవ్వాలని, మరో నాలుగు వారాల తర్వాత రూ.100 కోట్లు ఇవ్వాలని ఆర్డరు ఇచ్చింది. ఆర్‌టీసీ యాజమాన్యం ఆ డబ్బులు చెల్లించకుండా కోర్టు తీర్పు ఉల్లంఘనకు పాల్పడింది. కోర్టు తీర్పు అమలు కాకపోవడం మరో పిటీషన్‌ను 15మార్చి2023న హైకోర్టులో సీసీఎస్‌ యాజమాన్యం ఫైల్‌ చేసింది. దీనిపైన స్పందించిన కోర్టు 15మే2023 లోపు రూ.50 కోట్లు చెల్లించాలని, 25నవంబర్‌ 2022 నుండి ఆరు నెలలలోపు మరో రూ.100 కోట్లు చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని కూడా యాజమాన్యం అమలు చేయలేదు. యాజ మాన్యం చర్యను కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని సీసీఎస్‌ యాజమాన్యం కోర్టులో కేసు ఫైల్‌ చేసింది.
ఆందోళనలో కార్మిక కుటుంబాలు…
సీసీఎస్‌ సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు ఆర్‌టీసీ చేస్తున్న దానం కాదు. సీసీఎస్‌ కోసం రికవరీ చేస్తున్న డబ్బులను సకాలంలో సీసీఎస్‌కు చెల్లించమని మాత్రమే. ఆర్‌టీసీ ఆ పని చేయకుండా 45వేల మంది కార్మికుల కుటుంబాలతో ఆటలాడుకుంటున్నది. సీసీఎస్‌కు డబ్బులు జమ చేయడం ఆలస్యం చేస్తూనే, అధికారులందరూ తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని డబ్బులు తీసుకున్నారు. తాము చేసిన డిపాజిట్లను కూడా ఉపసంహరించుకున్నారు. అయినా ఇప్పటికి సీసీఎస్‌ పైన ఉన్న నమ్మకంతో 35వేల మంది రెగ్యులర్‌ కార్మికుల, 8వేల మంది రిటైరైన కార్మికులు వాటాదారులుగా ఉన్నారు. కార్మికుల కుటుంబాల ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనైనా సీసీఎస్‌ కోసం చేస్తున్న రికవరీలను ప్రతి నెలా జమచేయాలి. సీసీఎస్‌ సొమ్మును ఆర్‌టీసీ తన సొంత అవసరాలకు వాడుకొని సీసీఎస్‌ సంస్థను సంక్షోభం వైపు నెట్టడం అత్యంత దుర్మార్గం. కోర్టులో యాజమాన్యం వేసిన అఫిడవిట్‌పైన కూడా అసంబద్ధమైన వాదనలు చేశారు. రోజుకి రూ.5 కోట్లు నష్టం వస్తుంది కాబట్టి చెల్లించలేక పోతున్నామని, మరో ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు. ‘నీదికాని డబ్బులు సంవత్సరాల తరబడి వాడుకోవడమే ఒక తప్పు.. ఆ చర్యను సమర్ధించుకొనే క్రమంలో అడ్డగోలు వాదనలు చేయడం మరో తప్పు’ అనే విషయం ఆర్‌టీసీ యాజమాన్యం గుర్తించడం లేదు. ఆర్‌టీసీ వాడుకొన్న డబ్బులపై నిబంధనల ప్రకారం చెల్లిం చాల్సిన వడ్డీ మరో ప్రధానమైన సమస్య. అంతకుముందున్న నిబంధనను మార్చి 60 రోజుల తర్వాత చెల్లించకపోతే నిబంధనల ప్రకారం వడ్డీ చెల్లించాలని అంగీకరించిన ఆనాటి మేనేజింగ్‌ కమిటీది తప్పే. దానిని సరైన అర్ధంతో అమలు చేయకుండా, నేడు ఆర్‌టీసీ యాజమాన్యం రూ.400 కోట్లు వడ్డీ చెల్లింపు గురించి మాట్లాడటం లేదు. ఆర్‌టీసీ సంస్థ బ్యాంకుల నుండి తెస్తున్న అప్పులకు 12శాతం వరకు వడ్డీ చెల్లిస్తూ, సీసీఎస్‌ డబ్బులుపై వడ్డీ చెల్లించడంపై పిల్లిమొగ్గలు వేయడం సరైంది కాదు.
ప్రభుత్వ బాధ్యత లేదా?
ఆర్‌టీసీ సంస్థ చెల్లించాల్సిన అసలు రూ.670 కోట్లు (ప్రతి నెలా రూ.18 కోట్లు కలుపుకోవాలి), వడ్డీ డబ్బులు రూ.400 కోట్లు చెల్లించాలి. ఒకవేళ అనేక ఆందోళనల అనంతరం అసలు చెల్లించి, వడ్డీకి ఎగనామం పెట్టినా వాటాదారులు అందరూ లక్షకు పైగా నష్టపోతారు. సీసీఎస్‌ వద్ద డబ్బులు భద్రంగా ఉంటాయని నమ్మిన పేద కార్మికుల కుటుంబాలు మరీ ముఖ్యంగా రిటైరై వడ్డీ మీద ఆధారపడి బతికే కార్మికుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారు. 2019 సమ్మె ముగిసిన అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ పిఎఫ్‌ మరియు క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ బకాయిలు వాయిదాలలో చెల్లించబడతాయి అని హామీ ఇచ్చారు. కానీ నాలుగు సంవత్సరాలు గడిచినా అది అమలుకాక పోవడంపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించదా? ఆగస్టు 6న శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ, ఆర్టీసికి వున్న లయబులిటీస్‌, అప్పులన్నీ ఆర్‌టీసీనే చెల్లిస్తుంది అని అనడానికి అర్ధమేంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు, ఆర్‌టీసీ కార్మికుల దృష్టి మొత్తం ఆర్‌టీసీ విలీన ప్రక్రియపై ఎక్కువగా ఉంది. సీసీఎస్‌ను బతికించుకోకపోతే మనకి మనమే నిర్మించుకొన్న ప్రయోజనకర కో-ఆపరేటివ్‌ వ్యవస్థను కోల్పోతాము. అందుకని కార్మిక ప్రయోజనాల దృష్ట్యా ఆర్‌టీసీ యాజమాన్యం సీసీఎస్‌కు చెల్లించాల్సిన అసలు, వడ్డీ చెల్లించాలి. అందుకు అవసరమైతే ప్రభుత్వం ఆర్ధిక వెసులుబాటు కల్పించాలి, ఇప్పటి నుండైనా రికవరీ మొత్తాలను సీసీఎస్‌కు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే కార్మిక కుటుంబాల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
– పుష్పా శ్రీనివాస్‌