రెండు టికెట్లు ఇస్తేనే బరిలో.. ఎమ్మెల్యే మైనంపల్లి

నవతెలంగాణ-సిటీబ్యూరో
తనకు మల్కాజిగిరితోపాటు తన కుమారుడికి మెదక్‌ టికెట్‌ ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరపున బరిలో ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపుపై మంగళవారం మైనంపల్లి మరోసారి స్పందించారు. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. సోమవారం తాను పార్టీ గురించి ఏం మాట్లాడలేదని, వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిపారు. తనకు తన కుమారుడే ముఖ్యం అన్నారు. జీవితంలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, తనను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బదులిస్తానని హెచ్చరించారు. మెదక్‌, మల్కాజిగిరి కార్యకర్తలే తనకు ప్రధాన్యం అన్న మైనంపల్లి, తాను ఏ పార్టీనీ విమర్శించనని, పార్టీలకు అతీతంగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్‌ వచ్చాక కార్యకర్తలతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తన కుమారుడికి మెదక్‌ టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.