– రాజ్‌భవన్‌లో రహస్య చర్చలు ఎందుకు..?
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత ఎన్‌పి వెంకటేశ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముగ్గురూ తోడు దొంగలేనని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. వారి రూపం వేరుగా ఉన్నా మనస్సు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. మోడీకి మద్దతిస్తున్న కేసీఆర్‌ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మైనార్టీలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. బీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రముఖ న్యాయవాది ఎన్పీ వెంకటేశ్‌తోపాటు పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ సీఎం కేటీఆర్‌కు ధరణి పోర్టల్ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కచ్చితంగా రద్దు చేస్తామని పునరుదా ్ఘటించారు. ధరణి కంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చి భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదని చెప్పారు. ధరణి వచ్చిన తర్వాత 35 లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారనీ, కలెక్టర్లను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు భూములు దోచుకుంటున్నారని విమర్శించారు. ధరణి పనితీరుపై రాష్ట్రంలోని 12వేల గ్రామాల్లో ‘గ్రామ సభలు’ పెట్టేందుకు సిద్ధమా..? అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ…2018లో రైతుబంధు, రైతుబీమా తీసుకొచ్చారన్నారు. ధరణి వచ్చింది 2022లోనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే రైతు రుణమాఫీ, పంట నష్టం చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దోపిడీని ప్రశ్నిస్తే, బీసీ కార్డును ముందుపెడుతున్నారని చెప్పారు. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య అగాధం ఉన్నట్టు కేసీఆర్ ప్రజలను నమ్మించారని అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్, సీఎం రహస్య చర్చల సారాంశం ఏమిటని ప్రశ్నించారు. వీళ్లిద్దరి మధ్య ఎన్నికల పొత్తు అయినట్టా? కానట్టా? ప్రజలు ఆలోచించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు రూ. 4వేలకు పెంచుతామన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.