– స్తంభించిన పార్లమెంట్
న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ స్తంభించింది. దీంతో గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. దీంతో పార్లమెంటులో ప్రతిష్టంభన ఆరో రోజు కొనసాగింది. అదానీ కేసులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, అధికార బీజేపీ ఎంపీలు యూకేలో రాహుల్ గాంధీ చేసిన ప్రజాస్వామ్య వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన నిమిషాల్లో సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో ‘ మోడీ షేమ్ షేమ్, ‘వురు వాంట్ జేపీసీ’ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు హౌరెత్తించారు. తిరిగి సమావేశమైన ఉభయ సభల్లో పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో సభలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో రోజంతా వాయిదా పడింది. కాగా, నేడు (మంగళవారం) పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు సమయం కోరినట్టు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ”అనుమతి మంజూరు అయితే, రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటులో మాట్లాడతారు” అని ఖర్గే తెలిపారు. అంతకుముందు ప్రతిపక్ష నేతలు సమావేశమై.., పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు.