మోడీని ఓడించాలి.. దేశాన్ని రక్షించాలి

– బీజేపీ ప్రభుత్వం బ్రిటీషు పాలనలా ముగుస్తుంది
– కోల్‌కతాలో రెండు రోజుల ర్యాలీలో కార్మిక సంఘాల పిలుపు
కోల్‌కతా: క్విట్‌ ఇండియా 81వ వార్షికోత్సవం సందర్భంగా మోడీని తొలగించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన రెండు రోజుల ర్యాలీలో సీఐటీయూ, ఐఎన్‌టీయూసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు పాల్గొని మోడీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలన బ్రిటిష్‌ పాలనలా ముగుస్తుందని జోస్యం చెప్పాయి. కోల్‌కతాలో రెండు రోజుల నిరసన సందర్భంగా 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కోల్‌కతాలోని రాణి రష్మోని అవెన్యూ వద్ద పలు కార్మిక సంఘాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ”మోదీని ఓడించండి.. దేశాన్ని రక్షించండి” అనే నినాదాల మధ్య సీఐటీయూ, ఏఐటీయూసీ, యూటీయూసీ, ఏఐసీసీటీయూ, టీయూసీసీ, ఐఎన్‌టీయూసీ, రైల్వేలు, బ్యాంకులు, బీమా, పవర్‌ కార్పొరేషన్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల నుంచి ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాన్ని, ఆస్తుల విక్రయాన్ని తప్పుబట్టారు. బ్రిటీష్‌ పాలన లాగానే ప్రస్తుత కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వ పాలన ముగుస్తుందని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కృషి చేయాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
సామాన్య ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
ర్యాలీని ప్రారంభిస్తూ పశ్చిమ బెంగాల్‌ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి అనాది సాహు మాట్లాడుతూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లు కార్పొరేట్‌ సంస్థలకు లొంగిపోయి సామాన్య ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ”ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తానని వాగ్దానం చేసింది. కానీ ఏమీ జరగలేదు. దేశ ఆస్తులు అమ్మకానికి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. సాధారణ ప్రజలు భారీ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు” అని ఆయన ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వమే అతిపెద్ద అడ్డంకి అని సాహు అన్నారు. పెట్రోల్‌, వంటగ్యాస్‌ వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ”బీజేపీ, ఆరెస్సెస్‌ల పిలుపుతో దేశమంతటా మత ప్రచారం, విషపూరిత వాతావరణం విస్తరిస్తోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. ఈ ఫాసిస్ట్‌ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తూ, ఈ ప్రభుత్వానికి ఎలా తలవంచ కూడదో రైతుల ఉద్యమం చూపించింది” అని ఆయన అన్నారు.