మోడీ బాడీ లాంగ్వేజ్‌ బాలే…

– ఆయనో నియంత… కుటుంబపాలన గురించి మాట్లాడటం విడ్డూరం
– కేంద్రమంత్రివర్గంలో అవినీతిపరులు లేరా?
– వాళ్ల కేసుల విచారణ ఏమైంది?
– రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే సీఎం : మీడియా చిట్‌చాట్‌లో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిజామాబాద్‌ బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోడీ బాడీ లాంగ్వేజ్‌, చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కుటుంబపాలన గురించి మోడీ మాట్లాడటం మరీ విడ్డూరమన్నారు. అనేక రాష్ట్రాల్లో ఆవే కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న విషయాన్ని ఆయన మర్చి పోయారా అని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి ప్రధాని మాట్లాడటం అతిపెద్ద జోక్‌ అని కొట్టిపారేశారు. స్వయంగా ఆయన మంత్రివర్గంలోనే అవినీతి కేసుల విచారణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారనీ, బీజేపీలో చేరితే అవినీతిపరులు పునీతులై పోతారా అని ప్రశ్నించారు. శుక్రవారంనాడాయన శాసనమండలిలోని తన కార్యాలయం లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పథకాలు కొనసాగాలన్నా, ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి కావాలన్నా కేసీఆర్‌ మూడో సారి సీఎం కావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ బలపడిందని వారు ఊహించుకుంటున్నారనీ, దానికంత సీన్‌ లేదని చెప్పారు. నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లను బీఆర్‌ఎస్‌్‌ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడికి టిక్కెట్‌ ఇవ్వకపోవడంపై స్పందిస్తూ, అతని అవసరం ఉందని భావిస్తే, అప్పుడే పార్టీ పిలుస్తుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్ట్‌ చేయడం బాధాకరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏకసంఖ్య దాటే పరిస్థితులు లేవన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పొలిటికల్‌ స్టంట్‌ అనీ, దాని ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందొచ్చని బీజేపీ భావిస్తుందనీ, కానీ అది ఆపార్టీకి రివర్స్‌ అవుతుంందని అంచనా వేశారు. మహిళా రిజర్వేషన్లను ఎప్పుడు అమలు చేస్తారో వారికే స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌ తనను నామినేట్‌ చేసిన కేంద్రం ఎలా చెప్తే అలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. కులగణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేస్తేనే మంచిదనీ, దేశ వ్యాప్తంగా సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరాష్ట్రంలో ఓసీలుగా ఉన్న కులం మరో రాష్ట్రంలో బీసీలుగా, మరో రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నాయనీ, దానివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. 24గంటల కరెంటు సరఫరాపై లాగ్‌బుక్‌ల పరిశీలనపై మాట్లాడుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఉదయం ఒకలా, మధ్యాహ్నం మరోలా, రాత్రి పది తర్వాత ఇంకోలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు.