– కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 42 శాతానికి పైగా ఉపాధ్యాయ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 7,033 పోస్టులు మంజూరు చేశారు. వీటిలో జులై 1 నాటికి 3,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న రిజర్వ్‌డ్ టీచింగ్ పోస్టుల సంఖ్యపై జేడీయూ సభ్యుడు రామ్ నాథ్ ఠాకూర్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో భాగంగా మంత్రి ఈ సమాచారాన్ని లోక్‌సభలో వెల్లడించారు. ఓబీసీలకు సంబంధించి 46శాతం (1,665) పోస్టులు ఖాళీగా ఉండగా, ఎస్సీలకు 37 శాతం (837), ఎస్టీలకు 44 శాతం (505) టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజర్వ్‌డ్ కేటగిరీ కింద ఈ ఏడాది 517 మంది అభ్యర్థులను నియమించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. వీరిలో 285 మంది ఓబీసీలు, 150 మంది ఎస్సీలు, 82 మంది ఎస్టీలు ఉన్నారు. సెంట్రల్ యూనివర్శిటీల్లో మొత్తం ఖాళీలపై సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ అడిగిన మరో ప్రశ్నకు ప్రధాన్ స్పందిస్తూ.. జులై 1 నాటికి 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 54,512 మంజూరైన పోస్టుల్లో 22,412 పోస్టులు విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో రెగ్యులర్ మోడ్‌లో నడుస్తున్నాయని చెప్పారు. మిగతా పోస్టులు పూరించకుండానే ఉన్నాయి. ”విరమణ, రాజీనామా, అదనపు అవసరాల కారణంగా ఖాళీలు ఏర్పడతాయి. ఖాళీలు వచ్చినప్పుడు వాటిని భర్తీ చేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆదేశించాం” అని కేంద్ర మంత్రి తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మిషన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ప్రకారం స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా ఇప్పటివరకు 6,087 పోస్టులను భర్తీ చేసినట్టు ఆయన చెప్పారు.