సమాజ మార్పే లక్ష్యంగా మోరె జీవితం

– మహద్‌ పోరాటంలో ఆయన పాత్ర కీలకం
– అంబేడ్కర్‌, మోరె జీవితాలకు దగ్గరి పోలిక
– ఓ దళిత కమ్యూనిస్టు జ్ఞాపకాలు పుస్తకావిష్కరణలో మల్లేపల్లి లక్ష్మయ్య
– పుస్తకాన్ని ఆవిష్కరించిన రచయిత్రి బి.విజయ భారతి
– సామాజిక పోరాటాల ఆవశ్యకతను మోరె నొక్కిచెప్పారు : జి.రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమాజ మార్పే లక్ష్యంగా జీవితాంతం పనిచేసిన రామచంద్ర బాబాజీ మోరె ఆదర్శ కమ్యూనిస్టు అని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మెన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. అనేక అంశాల్లో అంబేడ్కర్‌, మోరెకు అభిప్రాయభేదాలున్నప్పటికీ సమాజ మార్పు కోసం వారిద్దరూ కలిసి పనిచేశారనీ, అనేక అంశాల్లో వారిద్దరి మధ్య పోలికలున్నాయని వివరించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఓ దళిత కమ్యూనిస్టు జ్ఞాపకాలు’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి బి.విజయభారతి ఆవిష్కరించారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ ఎడిటర్‌ కె.ఆనందాచారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వాసు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ..దళితులు అనివార్యంగా కమ్యూనిస్టులుగా మారాల్సిందేననీ, వారి జీవన విధానం కమ్యూనిస్టులకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. సమస్య ఎత్తిచూపటం, బలమైన ఉద్యమాలు చేయడమే కాదు..పరిష్కారం చూపే ఆలోచనావిధానం కూడా కలిగి ఉంటే బాగుంటుందన్నారు. మోరెలో ఆ లక్షణం ఉందన్నారు. మహద్‌లో రామచంద్ర బాబాజీ మోరె దళితులకు తాగునీటిని అందించేందుకు ఓ టీ కొట్టు ఏర్పాటు చేశారనీ, మార్కెట్‌లో దళితులకు జరుగుతున్న మోసాలు, మోసపోయిన రైతులకు న్యాయం చేసేందుకు అందరూ కదిలేలా ఉత్తేజం నింపేందుకు ఆ టీకొట్టు ఒక అడ్డాగా మారిందని వివరించారు. కాలక్రమంలో అంబేడ్కర్‌, మోరె నేతృత్వంలో మహద్‌ సామాజిక పోరాటానికి దారితీసిందని చెప్పారు. మోరె జీవిత చరిత్రను మహద్‌ చెరువు పోరాటం, బహిష్కృత భారత్‌ పత్రికలో పనిచేయటం, కమ్యూనిస్టు నేతగా ఎదగటం అనే మూడు దశలుగా చూడాలన్నారు. ఒక లక్ష్యం కోసం ఓ పార్టీలో పనిచేస్తూనే కలిసి వచ్చే శక్తులను కలుపుకుపోయే తత్వం అంబేడ్కర్‌, మోరెలో కనిపించిందన్నారు. దోపిడీ, తారతమ్యాలు లేని సమాజాన్ని చూడాలనే లక్ష్యంతో అంబేడ్కర్‌, మోరె పనిచేశారని తెలిపారు. 1920 దశకంలో కమ్యూనిస్టుల వల్లనే సమాజ విముక్తి సాధ్యమని యువత పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరారని చెప్పారు.
విజయ భారతి మాట్లాడుతూ..మోరె జీవిత చరిత్ర ప్రతిఒక్కరూ చదవాల్సిన పుస్తకమని నొక్కి చెప్పారు. ఆ పుస్తకం రీసెర్చ్‌ సోర్స్‌ మెటీరియల్‌ అన్నారు. కులవివక్షకు, దోపిడీ లేని సమాజం కోసం మోరె జీవితాంతం పనిచేశారని కొనియాడారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ భావ సంపద కుచించుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయం శక్తి తగ్గుతుందన్నారు. అన్నీ దేవుడే చూసుకుంటాడులే భావన పెరిగిపోవడం ప్రమాదకరమన్నారు.
ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి, పుస్తక అనువాదకులు ఎస్‌.వినయకుమార్‌ మాట్లాడుతూ..బహిష్కృత భారత్‌లో సబ్‌ ఎడిటర్‌గా మోరె పనిచేశారని తెలిపారు. ఇప్టాలో మోరె చాలా కీలక పాత్ర పోషించారనీ, సినీరంగానికి శైలేంద్ర, శ్రీరామచంద్ర, బాలరాజు తదితరులను అందించిన ఘనత మోరెకే దక్కుతుందన్నారు. ప్రజామద్దతుంటేనే వివక్ష పోతుందనీ, అది కమ్యూనిస్టులతో సాధ్యమనే భావనతోనే మోరె పార్టీలో చేరారని తెలిపారు. అంబేడ్కర్‌, మోరెల మధ్య సత్సంబంధాలు ఉండేవని చెప్పారు. టీపీఎస్‌కే నాయకులు జి.రాములు మాట్లాడుతూ..లాల్‌-నీల్‌ ఐక్యతకు ప్రతీకగా ఈ పుస్తకం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌, మోరె ఆనాడే కలిసి పనిచేశారనీ, లాల్‌-నీల్‌ ఐక్యతకు మహద్‌ పోరాటం గుర్తు అని చెప్పారు. దేశంలో కమ్యూనిస్టులు ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సామాజిక పోరాటాలనూ చేయాలని మోరె నొక్కిచెప్పారనీ, సీపీఐ(ఎం) మహాసభలో ఆ అంశంపై ఆయన డాక్యుమెంటరీ సమర్పించారని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ కాలంలో రాజకీయరంగంలోనే అణచివేతన కనిపిస్తే…నేడు బీజేపీ పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలపై ముప్పేట దాడి జరుగుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. యువత అప్రమత్తమై సమాజ మార్పు కోసం జరిగే పోరాటంలో పాలు పంచుకోవాలని కోరారు.