తల్లి వేరు..!

నవమాసాలు మోసి తల్లి కన్న బిడ్డకు
జీవిత కాలం నీడనిచ్చే
పచ్చని చెట్టు, నాన్న..!
బుడి బుడి నడకలు తడబడినపుడు
వేలు పట్టి నడిపించిన నడత, నాన్న..!

నిన్ను శిలగా మలచడానికి
ఉలి దెబ్బలు లెక్కచేయని
ధైర్యం, నాన్న..!
నీ అభ్యున్నత శిఖరాల కోసం
నిత్య శ్రామిక సూర్యుడు, నాన్న..!

చాలీచాలని సంపాదన ఉన్నా
నీకు ఆనందాన్ని పంచే
దీపావళి, నాన్న..!
నువ్వు పుష్పించడానికి, ఫలించడానికి
శ్రద్దగా సంరక్షించే తోటమాలి, నాన్న..!

నడి సంద్రంలో అలలు
విలయతాండవం చేసినా
ముందుండి నడిపించే
చుక్కాని, నాన్న..!
తల తాకట్టు పెట్టైనా
నిన్ను గెలిపించే నిట్టాడు నాన్న..!

తనతోనే నడక, నడవడిక..
తనతోనే గమనం, గమ్యం..
తనతోనే మార్గం, మార్గనిర్ధేశనం..!

తర తరాల విలువల సంస్కృతిని
నీకు అందించే వారధి నాన్న..!
అనాదిగా గెలిచి నిలిచే
జీవన వారసత్వానికి
తల్లి వేరు నాన్న..!!
– డా|| వాసాల వరప్రసాద్‌, 9490189847