రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి

– బీఎల్‌ఎఫ్‌ చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ పిలుపునిచ్చారు. రెండురోజులపాటు జరగనున్న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఓంకార్‌ భవన్‌లో బీఎల్‌ఎఫ్‌ పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 93 శాతం ఉన్న బహుజనులకు సామాజిక న్యాయం అమలు జరగాలంటే, అసెంబ్లీకి జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లినప్పుడే సామాజిక న్యాయం అమలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ప్రజలు పోరాడి సాధించుకున్న ఎకరం, రెండెకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్నదని విమర్శించారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం పేదలు అనేక ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నిరుపేదలకు భూమి, ఇల్లు, విద్యా, వైద్యం, ఉపాధి కల్పించాలని కోరారు. బహుజనులు వారి ఓట్లు వారు వేసుకుంటే శాశ్వత పాలకులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లెపు ఉపేందర్‌ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్‌, కె పర్వతాలు, ఎస్‌ సిద్దిరాములు, వస్కుల మట్టయ్య, రాంబాబు, కుంభం సుకన్య ఎం అంజనేయులు, చామకురు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.